మన గుడిమెళ్లపాడు కి స్వాగతం
జీవితంలో ప్రతి రోజూ ఎన్నో సంఘటనలు. కొన్ని సంతోషాన్ని పంచితే, మరికొన్ని బాధల్ని నింపుతాయి. ఆ క్షణంలో ఆనందాల్ని, అశ్రువుల్ని నింపిన సంఘటనలను కొన్నేళ్ల తర్వాత తల్చకుంటే అద్భుతంగా అనిపిస్తాయి. అవే జ్ఞాపకాలు. ఆ జ్ఞాపకాల్ని పదిలపరచుకునే వేదికే మనగుడిమెళ్లపాడు.కామ్. పలక, బలపం పట్టుకుని బడికి వెళ్లిన రోజులు, వేపచెట్లపై కోతికొమ్మచ్చి ఆడుకున్న రోజులు, చింతకాయలు కొట్టుకుని ఉప్పుకారం అద్దుకుని తిన్న రోజులు, టీవీలు రాని రోజుల్లో ఆరుబయట వెన్నెల్లో కూర్చుని కబుర్లు చెప్పుకున్న రోజులు, ఊరంతా కలిసి సీతారాముల కళ్యాణం చేసుకున్న రోజులు...మన ఆలోచనల్లో, అంతరంగాల్లో మాత్రమే ఉన్నాయి. మరికొన్నాళ్లు పోతే అక్కడి నుంచీ మాయమవుతాయి. కారణం అప్పటి రోజులకు మనదగ్గర ఆధారాలు లేవు. కనీసం పదిమందితో పంచుకంటే పదికాలాలు పాటు నిలిచి ఉంటాయి. ఇక నుంచి మన జీవితంలో జరిగే మంచికీ, చెడుకీ ఈ వెబ్‌సైట్‌ని వేదికగా చేసుకుందాం. మన జీవితాన్ని ఇక్కడ నిక్షిప్తం చేసుకుందాం.

ఆలయ ప్రహరీ నిర్మాణం పూర్తి..


 

మన గ్రామంలో కొలువై ఉన్న పెద్ద పొడపాటి వారి ఇలవేల్పు గంగాభవాని ఆలయ ప్రహరీ నిర్మాణం పూర్తైంది. ఆ ఇళ్ళలో ఉన్నతోద్యోగాలలో ఉన్న వాళ్ళు దీనికి విరాళాలు ఇచ్చారు. మల్లిపెద్ది రాజా, శ్రీదేవి దంపతులు ఆలయానికి గేటు అందజేశారు.  ఈ ఆలయంలో గత ఏడాది అమ్మ వారి విగ్రహాన్ని ప్రతిష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రహరీ నిర్మాణంతో అన్ని వసతులు సమకురినట్లయింది. 

- అశోక్ పొడపాటి 
ఫోటోలు:- సాయి పొడపాటి 
తేది :- 7-1-2015    
0 comments

సంక్రాంతికి స్వాగతం.. వేడుకలకు విరామం


తెలుగింటి పెద్ద పండుగ సంక్రాంతి... ప్రతి ఊరు, వాడకు నూతన శోభను చేకూర్చే ఈ పండుగను మన గ్రామంలో... గత మూడేళ్ళ నుంచి వైభవంగా జరుపుకుంటున్నాం. పిల్లల ఆటలు, పాటలు, బహుమతులు, సరదాలు, కేరింతలతో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. అయితే గత సంవత్సరపు అకాల మరణాలతో ఊరిలో విషాదం నెలకొని ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో.... వేడుకలు సబబు కాదనిపిస్తోంది. అందుకే ఈ ఏడాది సంబరాలకు సెలవు. కానీ  ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ సొంతూరికి చేరే సమయం మనకు కచ్చితంగా ప్రత్యేకం... కనుక బడి ఆవరణలో వేసే భోగి మంట, అన్న గారి వర్థంతి మాత్రం యధాతధం. 
                                          13వ తేదీ ఉదయం 4 గంటలకు మొదలయ్యే భోగి సంబరాలకు ఇదే స్వాగతం. అందరికీ ఎన్ని పనులున్నాపండగ మూడు రోజులు ఊరిలోనే గడపాలని మా విన్నపం. అన్న గారి వర్ధంతి వరకు ఉండాలని ఆకాంక్ష. 
సంక్రాంతి శుభాకాంక్షలతో..  
మనగుడిమెళ్ళపాడు. కామ్ 
తేది:- 3-1-2015        
0 comments

విషాద నామ సంవత్సరానికి సెలవ్...


కాల చక్రంలో మరో ఏడాది గడిచిపోయింది... 2014 ముగిసింది. కొందరికి ఆనందాన్ని పంచిన ఈ ఏడాది .. మరికొందరికి విషాదాన్ని మిగిల్చింది. ముఖ్యంగా మన ఊరికి ఇది కచ్చితంగా విషాద నామ సంవత్సరమే. ఎన్నో అకాల మరణాలు.. మరెన్నో అనారోగ్యాలు. పొడపాటి శేషయ్య, కారుమూడి సింగయ్య, వీరగంధం శ్రీలక్ష్మి, బెజవాడ వెంకటేశ్వర్లు, పొడపాటి కాంతమ్మ, పొడపాటి ఝాన్సి, కారుమూడి వెంకటేశ్వర్లు.....  ఇలా ఏడు నిండు ప్రాణాలను తనలో కలుపుకుని 2014 తరలి వెళ్ళిపోతోంది. ఎన్నో కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది.

ఈ విషాదాలకు ఇంతటితో తెరపడాలని... 
నూతన సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తూ.... 

నూతన సంవత్సర శుభాకాంక్షలతో... 
మనగుడిమెళ్ళపాడు. కామ్ 
(అశోక్ పొడపాటి)
తేది:- 31-12-2014 
0 comments

మరో ఊపిరి ఆగింది..

మన గ్రామంలో మరో విషాదం. మన ఊరికి చెందిన కారుముడి వెంకటేశ్వర్లు(వీరాస్వామిగారి) ఈ శుక్రవారం 
(21-11-2014) మధ్యాహ్నం కన్నుమూశారు. శనివారం ఉదయం ఆయన అంత్యక్రియలు ముగిశాయి. ఆయన మృతికి మనగుడిమెళ్ళపాడు.కామ్ నివాళులు అర్పిస్తోంది. ఆయన కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలుపుతోంది. 

తేది:- 22-11-2014  
2 comments
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved