మేము.. మా ఊరు..

మనగుడిమెళ్లపాడు.కామ్ కి స్వాగతం. గుడిమెళ్లపాడు.. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలానికి చెందిన ఓ కుగ్రామం. ఒంగోలు నగరానికి ఓ ఆరుకిలోమీటర్ల దూరంలో ఉంది. నిన్నమొన్నటి వరకు పక్కనే ఉన్న ముక్తినూతలపాడు పంచాయతీలో కలిసి ఉండేది.. ప్రస్తుతం ఒంగోలు కార్పొరేషన్ లో కలిసిపోయింది. భౌగోళికంగా, నైసర్గికంగా, వాతావరణ పరిస్థితులు దృష్ట్యా ఏవిధమైన ప్రత్యేకతలూ లేవు. ఓ వంద గడప. అందులో ఊరు యాభై.. పల్లె మరో యాభై. ముఖ్య వృత్తి వ్యవసాయం. పొగాకు, శనగ ప్రధాన పంటలు. ఇళ్ల సంఖ్యలో సగం.. పొగాకు బ్యారన్ లు ఉన్నాయి. ఊరిలో సింహభాగం సన్నాకారు రైతులే. పశుపోషణ ప్రధాన ఆదాయ వనరు. ఒకప్పుడు ప్రతి ఇంటికీ పశుసంతతి ఉన్నా.. ఇప్పుడు చాలావరకు తగ్గింది.

మా ఉద్యోగాలు..
గ్లోబలైజేషన్ పరిణామాల్ని మొదటిగా అర్థం చేసుకుని.. తదనుగుణంగా మారిన అతికొద్ది గ్రామాల్లో మాదీ ఒకటి అని సగర్వంగా చెప్పగలం. దాదాపుగా ఇంటికొకరుగా ఉన్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్లే దీనికి నిదర్శనం. ఊరికి చెందిన వారిలో అధిక భాగం హైదరాబాద్ లో స్థిరపడ్డారు. ఇంకా చెన్నై, బెంగళూరు, అమెరికా, కెనడా, మలేషియాల్లోనూ మా గ్రామస్తులు ఉండటం మాకు కొంచెం ఆనందం, మరి కొంచెం గర్వం కలిగించే విషయం. రియల్ భూమ్ ఊరి ముఖ చిత్రాన్ని కొంతమేర మార్చింది. ఊరిలో ప్రస్తుతం 80 శాతం వరకూ నూతన గృహాలే. వ్యవసాయ భూములు చాలా వరకు రియల్ వెంచర్లుగా మారాయి. నష్టాలతో కునారిల్లుతున్న రైతుల్ని ఈ పరిణామం కొంతమేర ఆదుకుందనే చెప్పాలి.

మా నీటి వనరులు..
ఇక ఊరి సంగతుల్లోకి వెళితే.. ఏక కులం కావడం ఊరి ప్రత్యేకత. ఊరిలో ప్రధానంగా పొడపాటి, కారుమూడి అనే రెండు ఇంటి పేర్లు ఉన్నాయి. బెజవాడ, రావెళ్ల, బోడపాటి మరికొన్ని. ప్రధాన నీటి వనరు చెరువు. ఇది ఎండిపోయినప్పుడు ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉన్న అప్పాయగుంట నీరే దిక్కు. ఇటీవల ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించినా.. దాని వల్ల ప్రయోజనం అంతంత మాత్రమే. ఊరు పక్క నుంచి గుండ్లకమ్మ వాగు ప్రవహిస్తుంది. దానిపై రెండు బ్రిడ్జిలు ఉన్నాయి. భారీ వర్షాలు కురిసినప్పుడు అది పెద్ద ఎత్తున 
పొంగి మమ్మల్ని గాబరా పెండుతుంది కూడా. 

మా దేవుళ్లు.. 
ఇక మా ఊరి వాసులకు దైవ భక్తీ కూడా ఎక్కువే. అందుకే ఊరిలో నాలుగు ఆలయాలు ఉన్నాయ్. ఒకటి రామాలయం కాగా మిగిలిన మూడింటిల్లో రెండు గంగమ్మ ఆలయాలు కాగా ఒకటి అంకమ్మ తల్లి ఆలయం. ఆయా దేవర్ల కొలుపుల సమయంలో ఊరంతా పూనకంతో ఊగిపోతుంది. ఊరి చివర ఉన్న వినాయకుడి రాళ్లు, జమ్మిచెట్టు, పుట్ట కూడా మాకు పూజనీయ స్థలాలే. వినాయక చవితి వేడుకలు కూడా ఘనంగానే జరుగుతాయి.

మా సరదాలు..
ఇక ఊరిలో ఆధిపత్య పార్టీ తెలుగుదేశం. ఊరి యువతరం ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహిస్తుంది. ఆర్భాటాలతో పాటు స్వచ్ఛమైన అభిమానం ఇక్కడ అదనం. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ ల జెండా స్థంభాలు చెరువు కట్ట మీద ఉన్నాయి. ప్రధాన క్రీడ క్రికెట్. కొన్ని తరాలు ఈ ఆట ఆడుతూ సెలవులన్నీ గడిపేశాయి. ఒక తరం క్రితం కోతికొమ్మచ్చి, కర్రాబిళ్లా, బొంగరలాట, సీతారాముడు, డీప్, కర్రాట, ఏడుపెంకులాట, పిచ్చిబంతి, గోలీలాట తదితర ఆటలు ఆడినా.. ఇప్పుడు మాత్రం ఓన్లీ క్రికెట్. మధ్యలో కొంతకాలం వాలీబాల్ ను కూడా ఆదరించాం.

మా కట్టుబాట్లు..
సంక్రాంతి సంబరాలు మా ఊరి ప్రత్యేకత. ఎక్కడెక్కడ సెటిల్ అయినవారందరూ సంక్రాంతికి తప్పనిసరిగా ఊరికి వస్తారు. హాస్టళ్లలోని పిల్లలు కూడా ఇళ్లకు చేరతారు. ఆ వారం ఊరికి వసంతం వచ్చినట్లుంటుంది. అంతటా కేరింతలు.. తుళ్లింతలు. ఆటలు.. పాటలు. భోగి నుంచి ఎన్టీఆర్ వర్ధంతి వరకు ఎన్నో కార్యక్రమాలు. రామాలయం వద్ద ఉమ్మడిగా వేసే భోగిమంటలో  మా ఐకమత్యం కూడా ప్రజ్వలిస్తుంది. ఇక పిల్లలకు పోటీలు, విజేతలకు, ర్యాంకర్లకు బహుమతులు ప్రతి ఏడూ చాలా సరదాగా జరిగిపోతుంటాయి. ఓ రోజు అందరం ఓ పిక్నిక్ లా ఎక్కడికన్నా వెళ్లివస్తుంటాం. 18వ తేదీ అన్నకు నివాళులర్పించాక.. రాత్రికి అందరూ దాదాపుగా వెళ్లిపోతారు. ఊరిని మళ్లీ నిశ్శబ్దం కమ్మేస్తుంది.


మా సమస్యలు.. 
అన్నట్టు చెప్పడం మర్చిపోయాం. మాకూ చాలా సమస్యలున్నాయి. మా ఊరికి ఇంతవరకు బస్ సౌకర్యం లేదు. మూడు కిలోమీటర్లు నడిచివెళ్లి కంపెనీ సెంటర్ వద్దో, లేక త్రోవగుంట దగ్గరో బస్ ఎక్కాలి. సరైన రోడ్డు కూడా లేదు. ఇక వాగుపొంగితే అంతే సంగతులు. ఊరంతా జలదిగ్బంధమే. నీటి కరువు మా కంటి మీద కునుకులేకుండా చేస్తుంది. శ్మశాన వసతి కూడా లేదు. పశువుల ఆస్పత్రి సైతం లేదు. అంతర్గత రోడ్లూ అంతంతమాత్రమే. వర్షం వస్తే సర్కస్ ఫీట్లు చేస్తూ నడవాల్సిందే. ఈ మధ్యే ఓ రోడ్ ను సిమెంట్ రోడ్డుగా మార్చారు. మిగిలినవి మాత్రం వర్షం వస్తే మాగాణిగా మారతాయి... 

మా మనసులోని మాట..
కాలం పూర్తిగా మారిపోయింది. ముందు తరాలు పుట్టుక ఎక్కడో.. పుడకలూ అక్కడే అన్నట్లు ఉండేవి. ఇప్పుడు బతుకు దెరువు కోసం, ఇంకా బాగా బతకడం కోసం, పిల్లల చదువుల కోసం ఎంతోమంది ఊరిని వదిలి వెళ్తుండటం మేము జీర్ణించుకోలేని విషయం. యువకులు పూర్తిగా పట్టణాల్లో సెటిల్ అవుతున్నారు. దీంతో ఊరు దాదాపు ఓల్డేజ్ హోమ్ గా మారిపోయింది. సగానికి పైగా (కొత్త) ఇళ్లల్లో ఓ టీవీ, ఓ సెల్, ఇద్దరు లేదా ఒకరు ముసలాళ్లు. ఆ టీవీ చూస్తూ కాలాక్షేపం చేయడం.. ఆ ఫోన్లో మాట్లాడుతూ సంబరపడటమే వారి జీవితం. ఇద్దరు ముసలాళ్లతో ఒకరు రాలిపోతే రెండో వారు ఎక్కడో సెటిలైన పిల్లల దగ్గరకు వెళ్తుంటారు. ఇక ఆ ఇళ్లు ఖాళీ. ఊరి నుంచి దూరంగా ఉన్న వారిలోనూ అదే అనిశ్చితి. ఊరి మీద, కన్న వారి మీద మమకారం ఉన్నా మాటిమాటికీ రాలేని పరిస్థితులు. దీంతో పుట్టిపెరిగిన ఊరి విషయాలు కనీసంగా కూడా తెలియని పరిస్థితి. పండుగలు, పబ్బాలు, పెళ్లిళ్లు, ఇతర వేడుకలకు రాలేని దుస్థితి. ఇంట్లో వాళ్లతో మాట్లాడుతున్నా.. ఊర్లోని అన్ని విషయాలు వాకబు చేయలేరుగా... మార్పుల గురించి మాట్లాడుకోలేరుగా.

అందుకే... మనగుడిమెళ్లపాడు.కామ్. ఊరిపై మాకున్న ప్రేమకు, బాధ్యతకు నిదర్శనమే ఈ వెబ్ సైట్. గది ముందుకు ఊరిని తీసుకురావడమే దీని ప్రధాన ఉద్దేశం. ఊరిలో లేకపోయినా.. ఇక్కడ జరిగే వేడుకల్న, విషాదాల్ని, పరిణమాల్ని అందరూ ఈ వెబ్ సైట్ ద్వారా చక్కగా చూడొచ్చు. అనుభూతుల్ని పంచుకోవొచ్చు. జ్ఞాపకాల సరసుల్లో ఈదులాడొచ్చు. ఎవరెవరు.. ఎక్కడెక్కడ.. ఏ స్థాయిలో ఉన్నా మనం అనే భావనను మనసుల్లో నుంచి చెదిరిపోకుండా చేయాలన్నదే దీని ఉద్దేశం.
మన ఊరు అనే తల్లి వేరు బంధం తెగిపోకుండా కాపాడటమే దీని లక్ష్యం.
దీని కోసం కొందరు కష్టపడుతున్నా.. అందరూ సహకరిస్తుంటారు.

ఈ వెబ్ సైట్ ఎందుకు, దీని ఉద్దేశాలు, లక్ష్యాలను సమగ్రంగా చెప్పే కథనం కింద క్లిక్ చేయండి..
Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved