నేను, చైతన్య, చక్రి...ఓ దీపావళి


అవి దీపావళి రోజులు. ముందురోజే పండుగ పూర్తయింది. మరుసటి రోజు స్కూల్ తెరిచారు. నేను, అరుణ, అనూష, శ్రీలత, స్రవంతి, సుజాత ఆ ఏడాది ఐదో తరగతి బ్యాచ్. చైతన్య, గంగాధర్, పీఎస్, భారతి(చేకూరపాడు) నాలుగో తరగతి చదువుతున్నారు. ఇక చిరంజీవి, చక్రపాణి, సురేంద్ర, జ్యోతి, కరుణ, కళ్యాణి వీళ్లందరూ రెండూ, మూడు తరగతుల్లో ఉన్నారు. ముందటేడాదే స్కూల్ బిల్డింగ్ పూర్తయింది. ఇప్పుడున్న చోట కట్టారు. దీనికి ముందు బడి రామస్వామిగారి కొష్టంలో ఉండేది. కొత్త స్కూల్ కట్టిన ఏడాదే అప్పటివరకు టీచర్‌గా ఉన్న దేవదానం సార్ బదిలీ మీద వెళ్లిపోయారు. బి. గోవిందు, లారెన్‌‌సలు కొత్త టీచర్లుగా వచ్చారు. కొత్త బడిలోకి బెంచీలు, బల్లలు, కుర్చీలు, పెట్టెలు మోసుకురావడం ఓ గొప్ప అనుభవం. అప్పటి వరకు నేల మీద కూర్చుని పాఠాలు విన్న వాళ్లకు బండల మీద కూర్చొని వినడం ఓ వరం. ఓ యోగం. ఓ అదృష్టం. కొత్త టీచర్లు, కొత్త బడి, కొత్త బెంచీలు... లైఫ్ బిందాస్. మా ఈ ఆనందాన్ని చూసి ఓర్వలేని దేవుడు విలన్‌లా మారి ఓ ట్రాజెడీ ప్లాన్ చేశాడు.

      పిల్లలందరూ ఆసక్తిగా ఎదురు చూసే కీలక సమయం రానే వచ్చింది. ఆ రోజు దీపావళి. ఉదయం నుంచే హడావిడి. పెద్ద బాంబులు కాల్చాలనే కోరిక, ధైర్యం, ఆసక్తి, తెగింపు ఉన్నా మన వయసు దష్ట్యా చేతికొచ్చింది కాకరపూవొత్తులు, పాముబిళ్లలే. కొట్టు దగ్గరకు వెళ్లి సింగమ్మనో, వెంకటేశ్వర్లునో అడిగి లక్ష్మీబాంబులో, పెల్లిబెసర బాంబులో కొనుక్కోవాలంటే ధైర్యం లేదు. డబ్బు కూడా లేదు. కీలకమైన దీపావళి అయిపోయింది. పెద్ద బాంబులు కాల్చాలన్న కోరిక మాత్రం మిగిలిపోయింది. తీరేదెలా..?

          మళ్లీ బడి మొదలైంది. నాలుగు ఐదు తరగతుల పిల్లలు బయట కూర్చున్నారు. ఒకటి, రెండు, మూడో తరగతి పిల్లలు లోపల కూర్చున్నారు. బయట గోవిందు పొంతులు ఏదో చెప్పుకుని పోతుంటే, లోపల లారెన్స్ మాస్టారు ఎప్పటిలాగే తనదైన శైలిలో నిద్రపోతున్నాడు. దీపావళి సరిగా జరుపుకోలేని బాధ వల్ల మాకేమీ వినపడటం లేదు. కనబడటం లేదు. అర్థం కావడం లేదు. ఇంతలో ఇంటర్వెల్. కొట్టడానికి చాలామంది పోటీపడ్డా బలంగా, ఎత్తుగా ఉండటం వల్ల గంగాధర్ గెలిచాడు. బెల్ కొట్టాక ప్రపంచాన్ని గెలిచినట్లు అందరి వంకా చూసి విజయగర్వంతో ఓ నవ్వు నవ్వాడు. 

                        దీపావళి సరిగా జరుపుకోలేదన్న బాధలో ఉండటం వల్ల నేను, చైతన్య ఇందులో ఏక్టివ్‌గా పార్టిసిపేట్ చేయలేకపోయాం. కొద్ది సేపు కష్టసుఖాలు చెప్పుకున్న తర్వాత, చింతకాయలను ఉప్పుకారంలో అద్దుకుని తింటున్న సమయంలో చైతన్యకు గొప్ప ఆలోచన వచ్చింది. ముందురోజు రాత్రే దీపావళి జరిగింది. చాలా మంది చాలా చాలా బాంబులు కల్చారు. వాటిలో చాలా పేలలేదు. మనం వాటిని తీసుకొచ్చి పేలిస్తే...ఈ ఐడియా చెప్పిన సమయంలో నాకు చైతన్యలో ఓ శాస్త్రవేత్త కనిపించాడు. ముందు రోజు గోవిందు పొంతులు చెప్పిన సైన్స్ పాఠంలోని ఐన్‌స్టీన్ చైతన్యయేమోనన్న అనుమానం కూడా వచ్చింది.  

             వెంటనే దీన్ని అమలు చేద్దామని నిర్ణయించుకున్నాం. మధ్యాహ్నం అన్నాల సమయంలో ఈ పని పూర్తి చేయాలని ఫిక్సయిపోయాం. ఇక అప్పటి నుంచి ఎప్పుడు మధ్యాహ్నం అవుతుందా అని ఒకటే ఏంగ్జయిటీ. ఆ ఏంగ్జయిటీలో పాఠాలు కూడా విన్లేదు. అంటే అంతకు ముందు విన్నాం అని కాదు. ఇప్పుడు మాత్రం విన్లేదు అని. మధ్యాహ్నం బెల్ కొట్టగానే ఊరి మీదకు పరుగుతీశాం. గుడి దగ్గర మొదలు పెట్టి తూములు, జెండా(అప్పుడు ఉందో లేదో...సరిగా గుర్తులేదు), నారాయణ బాబాయ్ ఇల్లు, సెంటర్, కొట్టు, ప్రెసిడెంట్ ఇంటి మీదుగా మా యింటికి చేరాం. ఒత్తులు పోయి పేలకుండా ఉన్న బాంబులన్నీ వేపచెట్టు కింద కుప్పగా పోశాం. ఒక్కోదాన్ని వీడదీసి దాన్లోని నల్లమందును ఓ పేపర్‌లో పోయడం మొదలుపెట్టాం. మా వెంట వచ్చిన చక్రి కూడా సాయపడ్డాడు. కాసేపటి తర్వాత చైతన్య వాడ్ని విసుక్కున్నాడు. ఏడుపు ముఖం పెట్టి..నేను వెళ్తున్నా అతోకు అన్నాడు.(చక్రి అప్పుడు నన్ను అలాగే పిల్చేవాడు.) కానీ వెళ్లకుండా దూరంగా నుంచున్నాడు. నల్లమందు అంతా కాగితంలో తీసుకుని దానిలో ఒత్తి పెడుతుంటగా అటుగా కోటయ్యతాత వచ్చాడు. ఆయన అప్పుడు నాగేశ్వరరావు పెద్నాన ఎడ్ల దగ్గర ఉండేవాడు. ఆయన ఏమీ అనకపోయినా ఆయనంటే మాకు భయం. ముఖ్యంగా ఆయన చేతిలోని చర్నాకోలను చూస్తే మాకు అమితమైన గౌరవం, భయం, వినయం కలిగేవి. ఇక వెంటనే మా నాయనమ్మ పంచలోకి వెళ్లాం. అప్పుడు ఆమె అక్కడ లేదు.(ఇప్పుడు కూడా లేదులే...చనిపోయింది.). 

              కాగితంలోని నల్లమందులో ఒత్తి పెట్టాం. చైతన్య అగ్గిపెట్టె తీసుకున్నాడు. వెలిగించేడు. ఆరిపోయింది. మళ్లీ వెలిగించాడు. ఆరిపోయింది. అప్పుడు నేనే క్రియేటివ్‌గా ఆలోచించి ఇలా కాదని ఆ కాగితం చుట్టూ చేతులు అడ్డుపెట్టాను. ముఖాన్ని దగ్గరగా తీసుకొచ్చి వాడు మళ్లీ వెలిగించాడు. అగ్గిపుల్లను ఒత్తి దగ్గరకు తీసుకొచ్చాడో...లేదో...పెద్ద మంట. నా వేళ్లు కాలిపోయి బొబ్కలెక్కాయి. వాడి పరిస్థితి ఏంటా అని వేళ్లు చూశాను బాగానే ఉన్నాయి. కొంచెం బాధేసింది. ఈ సారి వాడి ముఖం వైపు చూశాను. కాలి ఆంజనేయస్వామి మూతిలా తయారైంది. హ్యాపీ. ఇక మంట మొదలైంది. అప్పుడు ఇద్దరం అరవడం మొదలుపెట్టాం. ఇది చూసి చక్రి పరుగుపెట్టాడు. ఆనందంతోనో, బాధతోనో నాకు ఇప్పటికీ తెలియదు. ఇక అలాగే వెళ్లి కాలినగాయాల మీద నీళ్లు పోశాం. అవీ మరి పెద్దవై భయంకరంగా తయారయ్యాయి. ఈ మంట ఒకవైపు, ఇంటి దగ్గర తెలిస్తే ఏమంటారోనన్న భయం మరో వైపు. ఇక ఆ మధ్యాహ్నం స్కూల్‌కి వెళ్లలేదు. ఇంట్లో మాత్రం బడితపూజే. ప్రేమతో కొట్టినా... దెబ్బలు దెబ్బలే...నొప్పి నొప్పే కదా. ఇది జరిగి దాదాపు పదిహేనేళ్లు అయిందంటే నేను నమ్మలేకపోతున్నాను. ఏదో నిన్నమొన్న జరిగినట్లుంది. లైఫ్ మస్ట్ బి క్రేజీ యార్...

ఇదంతా ఎందుకంటే....
ఉద్యోగాలతో, వ్యాపారాలతో క్షణం తీరిక లేకుండా ఎవడికి వాడు నానా అవస్థలు పడుతుంటే ఈ గోల మాకేల...అని కొందరు అనుకోవచ్చు. రిలాక్సేషన్ కోసం చాలా టెక్నిక్స్ ఉన్నాయి. మెడిటేషన్, యోగా, లాఫింగ్ థెరపీ ఇలా సవాలక్ష. వాటికన్నా ఉత్తమమైన మరొక టెక్నిక్ నోస్టాల్జియా. మన జీవితంలో అద్భుతం అనదగ్గ సంఘటనల్ని గుర్తు చేసుకుని, ఆ ఆనందపు అనుభూతుల్ని గుండె నిండా నింపుకోవడం. ఆ ఉద్దేశంతోనే ఇది నేను రాసుకున్నాను. దాదాపు ఎవరి జీవితంలోనైనా అద్భుతమైంది బాల్యం. రుజువు కావాంటే మీరొక్కసారి గుర్తుకుతెచ్చుకుని చూడండి. ఇప్పుడు దీపావళి ఉంది, జేబులో డబ్బూ ఉంది. అయినా టపాసులు కాల్చాలన్న కోరికలేదు. జీవితం అంటే ఇదేనేమో. దీనిలో నేను ప్రస్తావించిన చాలా మంది ఇప్పుడు సజీవంగా లేరు(సింగమ్మ, వెంకటేశ్వర్లు, కోటయ్య, మా నాయనమ్మ) . మన జీవితంలోని కొంతభాగం వారితో ముడిపడి ఉంది కనుక వాళ్లని స్మరించుకోవడం మన విధి, బాధ్యత, కర్తవ్యం. ఎందుకంటే మనం కూడా మనుష్యులం కనుక. ఓ రచయిత అన్నట్లు చివరకు మిగిలేది జీవితాలు కాదు జ్ఞాపకాలే. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. ఇదంతా కల్పితం అనుకుంటారేమో. పచ్చినిజం. అప్పుడు కాలిన గాయాల గుర్తులు నా చేతివేళ్లపై ఇంకా ఉన్నాయి. ప్రత్యక్ష సాక్షి చక్రి కూడా హైదరాబాద్‌లోనే ఉన్నాడు. అప్పుడు నా పేరు కూడా సరిగా పలకలేని చక్రి ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఈ మధ్యే జాబ్ లో జాయిన్ అయ్యాడు. ఎదిగిపోయాడు మరి.

                                                                                      -అశోక్ పొడపాటి
Share this article :

+ comments + 9 comments

Ps Podapati
November 7, 2012 at 2:33 AM

marvelous, నిజంగా ఇవన్ని చదువుతుంటే ఎంత సంతోషంగా ఉందంటే (మీకు దెబ్బలు తగలాయి అని కాదు), అది ఇంక ఇలా రాస్తూ చెప్పలేను.
15 సంవస్చరాల క్రితం (ఒక మనిషి జీవిత కాలం లో 1/4 వంతు) జరిగిన సంగతి. అది ఇప్పుడు ఒక జ్ఞాపకంగానే కాదు ఎంతో మందిని మల్లి జ్ఞాపకం చేసింది.
మల్లి ఒకసారి ఆ రోజులు ని గుర్తుచేసింది. తలుచుకుంటేనే ఎంత ఆనందంగా ఉంది. అప్పుడు స్కూల్ లో ఉన్న కొందరి పిల్లల పిల్లలు ఇప్పుడు స్కూల్ కి వెళ్తునారు.
ఇంక ఆ పుణ్య మూర్తులు (సింగమ్మ, వెంకటేశ్వర్లు, కోటయ్య, అశోక్ వాళ్ళ నాయనమ్మఇంకా కొందరు... ) ఇప్పుడున్న పిల్లలకు అసలు తెలియక పొవచ్చు. సంబంధాలు అనేవి
లేకుండా కొందరు ఇప్పుడు గిరి గీసుకొని బ్రతుకుతున్నారు. అలాంటి వాళ్లకు జీవితం అంటే ఏంటో తెలుసుకోవడానికి ఇది చదివితే చాలు. చివరిగా ఇంత మందిని గుర్తుచేసిన ఈ విషయం మీకు అప్పుడు కొంచెం బాధ అనిపించినా ఇప్పుడు మాత్రం ఆ రోజుల్లో అప్పుడు జరిగిన వాటిని గుర్తుచేసుకుంటుంటే ఒక అందమైన ప్రపంచంలో మన అనే ఆత్మీయుల మధ్య కొంచెంసేపు గడిపిన ఫీలింగ్ కలుగుతుంది. అయినా ఆరోజులు మల్లి రావు వచ్చినా అలా ఉండవు. ఇంత మంచి జ్ఞాపకాన్ని ఇంకా గుర్తుపెట్టుకొని ఇంత అద్బుతంగా రాసిన అశోక్ కి నా కృతజ్ఞతలు.

మీ
పి యస్.

November 7, 2012 at 10:14 AM

చాల చక్కగా చెప్పావు అశోక్ 15 ఏళ్ల క్రితం జరిగిన చిన్నప్పటి విషయాలను కళ్ళ ముందు మొన్నే జరిగాయమో అనేలా

నిజం గానే అద్బుతం గా రాసావు అశోక్ ,మంచి ఐన చెడు అయినా కూడా అవి చెప్పలేని ఆనందాన్ని కల్గిన్చేలా ఉండేవి ...మనకు తెల్సిన

మన ముందు తరం వాళ్ళ గురించి మన వెనక ఉన్న పిల్లకాయలకు తెలియ చెప్పటం కూడా చిన్న పాటి మన బాధ్యత కుడా ...మొత్తానికి ఈ దీపావళి కూడా బాగా చేసుకోవాలని కోరుకుంటూ

ఇలాంటివి అందరు వారి వారికీ తెల్సినవన్ని ఇప్పుడే పేపర్ మీద పెట్టండి ....రాసి మన వెబ్సైటు కి పంపండి ...




Thanks&Regards

Madhu karumudi.

November 7, 2012 at 10:44 AM

baagundi ashok.ilaantivi prathi okkadi jeevitham lo eppudo okappudu jarige untayyi.....

November 7, 2012 at 12:22 PM

thanks to all

Anonymous
November 8, 2012 at 2:44 PM

This real story is good ,your site looks

also so nice,good work guys .



regards,
chaitu.

November 21, 2012 at 12:23 PM

funny........n nice experience too.

January 10, 2013 at 12:17 PM

హాయ్ అశోక్,
బాగా రాశావు అని చెప్పడం కన్నా జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చావ్ అంటే
బాగుంటుందేమో. నీ ఆర్టికల్ చూసిన తర్వాత నేను చేసిన పని
నా చిన్నప్పటి ఫ్రెండ్ కి ఫోన్ చేశాను చాలా సేపు స్కూల్ కబుర్లు
ఎంత టైం గడిచిందో తెలియలేదు. ఇలాగే రాస్తూ ఉండండి.

January 10, 2013 at 1:05 PM

thank you hyma reddy garu

February 16, 2013 at 11:52 AM

thanks to all

Post a Comment
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved