ఈ వెబ్‌సైట్ ఎందుకంటే..... ???

ఒంగోలు నగరానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడిమెళ్లపాడు అనే ఒక ఊరికి, ఎటు నుంచి లెక్కేసినా యాభై ఇల్లుకూడా లేని  అతి చిన్న పల్లెకు, వేళ్ల మీద లెక్కేపెట్టేంత మంది కుర్రాళ్లు మాత్రమే ఉన్న ఓ కుగ్రామానికి...మాట్లాడుకోవాలంటే ఫోన్లు, అవి సరిపోకపోతే గూగుల్ గ్రూప్, అదీ సరిపోకపోతే ఫేస్‌బుక్ గ్రూప్ ఉన్నా, మళ్లీ ఈ వెబ్‌సైట్ అవసరమా..?జీవితంలో ప్రతి రోజూ ఎన్నో సంఘటనలు. కొన్ని సంతోషాన్ని పంచితే, మరికొన్ని బాధల్ని నింపుతాయి. ఆ క్షణంలో ఆనందాల్ని, అశ్రువుల్ని నింపిన సంఘటనలను కొన్నేళ్ల తర్వాత తల్చకుంటే అద్భుతంగా అనిపిస్తాయి. అవే జ్ఞాపకాలు. ఆ జ్ఞాపకాల్ని పదిలపరచుకునే వేదికే మనగుడిమెళ్లపాడు.కామ్. పలక, బలపం పట్టుకుని బడికి వెళ్లిన రోజులు, వేపచెట్లపై కోతికొమ్మచ్చి ఆడుకున్న రోజులు, చింతకాయలు కొట్టుకుని ఉప్పుకారం అద్దుకుని తిన్న రోజులు, టీవీలు రాని రోజుల్లో ఆరుబయట వెన్నెల్లో కూర్చుని కబుర్లు చెప్పుకున్న రోజులు, ఊరంతా కలిసి సీతారాముల కళ్యాణం చేసుకున్న రోజులు...మన ఆలోచనల్లో, అంతరంగాల్లో మాత్రమే ఉన్నాయి. మరికొన్నాళ్లు పోతే అక్కడి నుంచీ మాయమవుతాయి. కారణం అప్పటి రోజులకు మనదగ్గర ఆధారాలు లేవు. కనీసం పదిమందితో పంచుకంటే పదికాలాలు పాటు నిలిచి ఉంటాయి. ఇక నుంచి మన జీవితంలో జరిగే మంచికీ, చెడుకీ ఈ వెబ్‌సైట్‌ని వేదికగా చేసుకుందాం. మన జీవితాన్ని ఇక్కడ నిక్షిప్తం చేసుకుందాం. మన ఊరు పదేళ్ల క్రితం ఎలా ఉంటుందో చెప్పడానికీ సాక్ష్యాలు ఏమీ లేదు. మళ్లీ ఆ పరిస్థితి రానీయ్యొద్దు. ఇప్పటి ఊరిని పదేళ్ల తర్వాత మనం చూసుకోగలం. ఈ సైట్ ద్వారా. ఇప్పుడు మన ఊరు ఒంగోలు నగరంలో ఒక భాగం. కొన్నేళ్ల తర్వాత దీని ఉనికే ఉండకపోవచ్చు. ఏదో కాలనీగా మిగిలిపోవచ్చు. ఒకప్పుడు ఇది ఒక పల్లెని, ఆ వెంచర్లలో వ్యవసాయం చేసే వాళ్లని, ఎద్దులతో పొలం దున్నేవారని, ఆ చెర్లో నీళ్లు పొద్దున్నే కావిళ్లతో ఇళ్లకు మోసుకె ళ్లేవాళ్లని, అవే తాగేవారని, ప్రతి ఇంటి ముందూ పశువులుండేవని, రైతు కుటుంబంలో పశువులూ సభ్యులేనని చెబితే మన పిల్లలు నమ్మకపోవచ్చు. మన కళ్లముందే కనుమరుగైపోతున్న పల్లె‘ధనాన్ని’ కాపాడుకోలేకపోయినా, ఆ వైభవాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనమీద లేదా?


 కారణాలు ఏవైనా ఊరు గతంలోలా లేదువర్గపోరు గ్రామాన్ని నిట్టనిలువునా చీల్చింది. ఆ వర్గాల్లో మళ్లీ చీలికలు, పీలికలు. వీధికో పార్టీ, ఇంటికో నాయకుడు. చుట్టూ ఉన్న చెట్లలాగే మనుషుల్లో ఆత్మీయతలు తగ్గిపోయాయి అనడం కంటే మాయమైపోయాయి అనడం సబబు. అవసరాలు తప్పితే ఆప్యాయతలు లేవు. మాటల్లో రాజకీయాలు తప్పితే జీవితాలు లేవు. అసూయ తప్ప ఆపేక్ష లేదు(ఈ అభిప్రాయం పూర్తిగా వ్యక్తిగతం. అందరూ ఆమోదించాలని లేదు). ఇప్పటి తరానికి ఆ ఆత్మీయతల్ని ఒక్కసారి గుర్తుచేసి, ఐకమత్యం విలువను చాటిచెప్పి, ఆ విషపు నీడలు పడకుండా వారినైనా కాపాడుకోవడం ఈ వెబ్‌సైట్ ప్రధాన ఉద్దేశం. 


 చాలా మంది చాలాచాలా కారణాలతో ఊరు విడిచి వెళ్లారు. మరికొందరు వెళ్లేందుకు ఆయత్తమవుతున్నారు. ఈ ఊరిలో మూలాలున్న ఎంతోమంది వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. కొందరు ఆడపడుచులు విదేశాల్లో ఉన్నారు. వారందికీ ఊరితో ఉన్న అనుబంధాన్ని తెగిపోకుండా కాపాడాల్సిన బాధ్యత ఊరిమీద అభిమానమున్న ప్రతి ఒక్కరిపై ఉంది. ఊరి గురించి మనం పోస్ట్ చేసే సాధారణ ఫొటోలు, వార్తలు వారికి అబ్బురంగా అనిపించొచ్చు. ఊరిలోనే ఉంటున్న అనుభూతిని తీసుకురావచ్చు. గ్రామంలో జరిగే చిన్నచిన్న వేడుకలు, కొలుపులు, మరేదైనా ముఖ్య సంఘటనలను ఫొటోల రూపంలో భద్రపరచుకోవడం మన బాధ్యత.  

 చివరిగా...........
ఈ వైబ్‌సైట్‌కి ఓనర్లు, క్లీనర్లు ఎవ్వరూ లేరు. ఇది గ్రామం మీద అభిమానమున్న ప్రతి ఒక్కరిదీ. దీన్ని విజయవతంగా నడిపించాల్సిన బాధ్యత కూడా అందరిదీ. దీనికి సమిష్టి కృషి  కావాలి. ముందుగా ప్రతి ఒక్కరూ మీ మెయిల్ ఐడీని సైట్‌లో రిజిస్టర్ చేసుకోండి. అలాగే మీ బంధువులు, స్నేహితులను కూడా దీనిలో భాగస్వాముల్ని చేయండి. ఊరిపై మీకున్న అభిప్రాయాన్ని రాసి మెయిల్ చేయడం మరచిపోకండి. వెబ్‌సైట్ విజయానికి సూచిక దానికి వచ్చే మెయిళ్లు, స్పందనలే. మీరు విహారయాత్రలు, విందులు, వినోదాలకు వెళ్లినప్పుడు, లేదా ఏదైనా పురస్కారం లభించనప్పుడు మరేదైనా ముఖ్య సంఘటన జరిగినప్పుడు దాన్ని మనవాళ్లతో పంచుకోండి. వీలైతే ఫొటో జత చేయండి. పండుగలు, పర్వదినాల ప్రాశస్త్యాన్ని తెలిపే రచనలు చేయండి. కనీసం వారానికి ఓ ఆర్టికల్ పంపేలా ప్రణాళిక రూపొందించుకోండి. టెన్త్, ఇంటర్ అయిపోయిన పిల్లల కెరీన్‌ను గైడ్ చేయండి. దీనిలోని ఆర్టికల్స్‌పై మీ స్పందనల్ని తప్పనిసరిగా కామెంట్ల రూపంలో తెలియజేయండి. వ్యాసాలపై స్పందన లేకపోతే రచయితలు నిరుత్సాహపడొచ్చు. సైట్‌లో మార్పులేమైనా చేయాలినిపిస్తే నిరభ్యంతరంగా సూచించండి. ఈ ఆర్టికల్‌లో మీకు ఇబ్బందికరంగా అనిపించిన విషయాలుంటే తెలియజేయండి. పరిహరిస్తాం. 

ఇప్పుడు చెప్పండి... మన ఊరికి వెబ్‌సైట్ అవసరమా...కాదా?


-అశోక్ పొడపాటి
Share this article :

+ comments + 7 comments

Anonymous
October 17, 2012 at 9:31 PM

Avasarameeeeeee

October 21, 2012 at 8:17 PM

GOOD JOB BOYS.......REALLY VERY GOOD

Anonymous
November 9, 2012 at 11:31 PM

Nice

January 9, 2013 at 4:58 PM

మీ ఉరి సంగతులు చాలా బాగున్నై. నిన్నటికి రేపటికి
పోలికలు కనుమరుగవుతూ ఉన్న రోజులు ఇవి కాబట్టి ఇలాంటి ఆలోచన చాలా కరెక్ట్. మంచి పని చేస్తున్నారు.

January 10, 2013 at 1:10 PM

హైమా రెడ్డి గారు....మీ స్పందనలకి, ప్రోత్సాహానికి ధన్యవాదాలు.

June 5, 2014 at 7:27 PM

Its must

Post a Comment
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved