మన ఊరు- ప్రస్తుత తీరు- 3

మన ఊరు- ప్రస్తుత తీరు సిరీస్ లో ఇది మూడోది, ఆఖరు భాగం. మొదటి భాగంలో శిథిలమైన, ఖాళీ అయిన ఇళ్లు.. రెండో భాగంలో నూతన గృహాలు చూసిన మీరు.. ఈ భాగంలో మన ఆలయాలు, ఆటస్థలాలు, చెరువు, బడి, వాటర్ ట్యాంక్ తో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన తాత్కాలిక పార్టీ ఆఫీస్ ను చూస్తారు.

ప్రస్తుతం మన ఊర్లో మొత్తం నాలుగు ఆలయాలు ఉన్నాయి. వీటిలో ఒకటి రామాలయం కాగా మిగిలినవి రెండు గంగమ్మ, ఒకటి అంకమ్మ ఆలయాలు. వీటిలో పురాతన రామాలయానికి ఇటీవలే మరమ్మతులు చేయించారు. ముఖద్వారంపై పట్టాభిషేక ఘట్టం రూపొందించారు. మొన్న జరిగిన శ్రీరామనవమి ఉత్సవాల కోసం ఫ్లోరింగ్ చేయించారు. ఇక కారుమూడి వారి ఇలవేల్పు అంకమ్మ తల్లి ఆలయాన్ని ఇటీవలే.. కారుమూడి సింగయ్య కొష్టం దగ్గర నిర్మించారు. గతంలో అమ్మవారి కోసం నిర్మించిన షెడ్ పూర్తిగా శిథిలమైపోయింది. ఇక రెండు గంగమ్మ ఆలయాలకు ప్రహరీలు కట్టాలనే ఆలోచలో నిర్వాహకులు ఉన్నారు. ఇది త్వరలోనే కార్యరూపం దాల్చవచ్చు. ఇవి కాక ఊరి చివర ఉన్న పుట్ట, జమ్మిచెట్టులు అదనం. ఏటా జరిగే వినాయక చవితి ఉత్సవాలు మన భక్తిశ్రద్ధలకు తార్కాణం.

ఇక ఇతర విషయానికొస్తే పిల్లలు లేని కారణంగా గత ఏడాది పాఠశాలను మూసివేశారు. ఊర్లోని పిల్లలందరూ ఒంగోలులోని కాన్వెంట్లలో చదువుకుంటున్నారు. కొందరు హాస్టళ్లలో ఉండి చదువు సాగిస్తుండగా.. మరికొందరు ఊర్లోకి వచ్చే వ్యాన్ లో డైలీ వెళ్లి వస్తుంటారు. మనందరం చదువుకున్న స్కూల్ ఇప్పుడు ఇలా మూతపడిపోవడం అత్యంత బాధాకరం. 1996-97 సంవత్సరాల్లో ఈ స్కూల్ ను ప్రారంభించినట్లు నాకు గుర్తు. దేవదానం సార్ ట్రాన్స్ ఫర్ తర్వాత వచ్చిన బి.గోవిందు, లారెన్స్ మాస్టర్ల ఆధ్వరంలో స్కూల్ కొన్నాళ్లు వెలిగిపోయినా, క్రమేపీ పిల్లల సంఖ్య తగ్గుతూ వచ్చింది. తర్వాత కొన్నాళ్లకు దేవదానం సార్ మళ్లీ వచ్చి శాయశక్తులా స్కూల్ ను అభివృద్ధి చేయాలని చూశారు. స్కూల్ చుట్టూ ఫెన్సింగ్ వేశారు. మొక్కలు నాటారు. పిల్లలకు ప్రత్యేక శ్రద్ధతో పాఠాలు చెప్పారు. కానీ దురదృష్టం.. ప్రైవేట్ మోజులో ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోకి పంపడానికి పెద్ధగా ఆసక్తి చూపలేదు. తర్వాత ఆయన ట్రాన్స్ ఫర్ అయ్యారు. ఆయన స్థానంలో వచ్చిన అనూరాధ టీచర్ పని చేస్తున్న సమయంలోనే స్కూల్ మూతపడింది.

ఇక ఎన్నికల కోసం మన ఊర్లో కారుమూడి సింగయ్య తాత కొష్టం దగ్గర తాత్కాలికంగా ఓ పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేసి.. తెలుగుదేశం జెండాలు అమర్చారు. ఓ టీవీ ఏర్పాటు చేశారు. ఇక మంచినీళ్లు, ఇతర వసతులు సరేసరి. కారుమూడి మురళీ కృష్ట, రావెళ్ల వేణు, పొడపాటి వెంకటకృష్ణ, పాపారావు తదితరులు దీని నిర్వహణ బాధ్యతలు చూసుకున్నారు. మొత్తంగా వీరందరి కృషి ఫలించి మన ఊర్లో టీడీపీకి 160 ఓట్ల పైచిలుకు ఆధిక్యం లభించింది. ఒంగోలు నియోజకవర్గంలో పార్టీ విజయం సాధించింది.

ఇక చెరువు విషయాని కొస్తే నీళ్లు బాగానే ఉన్నాయి. మనకి ఏర్పాటు చేసిన వీధి కుళాయిల్లో అప్పుడుప్పుడు మాత్రమే నీళ్లు వస్తుంటడంతో.. ఈ చెరువే మనకు దిక్కు. కుళాయిల కోసం ఊరి మధ్యలో, బడి పక్కన ఓ ట్యాంకు ఏర్పాటు చేశారు. జెండా దగ్గర ఎప్పటిలాగే పెద్దల సమావేశాలు జరుగుతున్నాయి.

ఇక మనం మాట్లాడుకోవాల్సిన చిట్టచివరి అంశం.. ప్లే గ్రౌండ్. పొడపాటి సుబ్బారావు(రామస్వామి గారి) కొష్టమే మనకు చాలా కాలంగా ప్లేగ్రౌండ్. మన వేసవి సెలవులు, సంక్రాంతి, దసరా సెలవులు అన్నీ దాదాపుగా అక్కడే గడిచిపోయాయి. ఇంతటి బిజీ రోజుల్లోనూ ఎప్పుడూ ఓ ఇరవై మంది అక్కడ గుమిగూడటం ఓ గొప్ప విషయం. తర్వాతి తరం పిల్లలు కూడా ఇప్పుడు అక్కడే చక్కగా క్రికెట్ ఆడుకుంటున్నారు. ఓ పదేళ్లుగా మన పదఘట్టనలకు ఓపికతో భరిస్తున్న ఆ నేల తల్లికి వందనాలు.

చివరిగా...
ఊరి నుంచి దూరంగా ఉన్న వారి కళ్ల ముందుకే ఊరిని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రాసినవే ఈ మన ఊరు- ప్రస్తుత తీరు వ్యాస పరంపర. వారితో పాటు అడపాదడపా ఊరికి వస్తున్నా.. సిగ్గు వల్లో, మొహమాటం వల్లో, లేక మనం పెద్దవాళ్లం అయిపోయాం.. ఇక ఇలా చిల్లరిగా ఊర్లో తిరగ్గూడదు అన్న భావనతో బయటకు రాని వారికి కూడా ఇవి ఉపయోగపడొచ్చు. ఇది మొత్తం రాసింది నేనే అయినా.. దీనికి ప్రాణం ఫొటోలు. వాటిని నేను, చక్రి కారుమూడి ఊరంతా తిరుగుతూ తన ఫోన్లోనే తీశాం. సో థ్యాంక్స్ టు చక్రి. అలాగే పిల్లలు కార్తీక్, ఉత్తేజ్, గణేష్ లు ఊరంతా మా వెంట తిరిగారు. వారికీ మా కృతజ్ఞతలు. మేమే ఇంకేదైనా మిస్ అయినా, ఫలానా విషయం గురించి రాస్తే బావుంటుంది అని మీరనుకుంటున్నా మా దృష్టికి తీసుకురండి. లేదు మీరే రాస్తామంటే మరీ మంచిది. అడ్రస్ సైట్లోనే ఉంది. నాకు మెయిల్ చేసినా మీ పేరుతో పోస్ట్ చేస్తాను. సైట్లో అందరి భాగస్వామ్యం పెరగాలనే మేము మొదటి నుంచి కోరుకుంటున్నాం.

ఈ వ్యాస పరంపరపై మీ ఫీడ్ బ్యాక్ తెలిపితే సంతోషిస్తాం. తెలపకపోయినా నో రిగ్రేట్స్.


ధన్యవాదాలతో
- అశోక్ పొడపాటి
ఫొటోలు: చక్రి కారుమూడితో కలిసి
తేదీ:- 3-6-2014


ఈ  వ్యాస పరంపరలో మొదటి భాగం కోసం   కింద క్లిక్ చేయండి..
రెండో భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సర్వేజనా సుఖినో భవంతు..
Share this article :

+ comments + 2 comments

June 11, 2014 at 3:03 PM

I am very happy, because i was little,i spend my summer holidays in this village, with playing cricket & karrabill etc...

June 11, 2014 at 3:48 PM

గుర్తుంచుకుని స్పందించినందుకు థ్యాంక్స్..

Post a Comment
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved