అంబరాన్నంటిన గంగమ్మ సంబరం

కన్నుల పండువగా విగ్రహ ప్రతిష్ఠ
ఉత్సాహభరితంగా సాగిన ఊరేగింపు
సాగర తీరంలో సందడి
పెద్ద పొడపాటి వారి ఇలవేల్పు గంగాభవానీ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన, ఆలయ పునరుద్ధరణ, కొలుపులు ఆగస్లు 16 నుంచి 20వ తేదీ వరకు గ్రామంలోని ఆలయం వద్ద అట్టహాసంగా జరిగాయి. ఊరేగింపులు, డప్పుల మోతలు, వీరతాళ్లు, చిందులు, పూనకాలు, హారతులు, బైనీడి వారి కథలతో ఊరికి ఉత్సవ శోభ వచ్చింది. ఐదు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలకు మనూరితో పాటు ముక్తినూతలపాడు, త్రోవగుంట నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. తరలివచ్చిన బంధుగణంతో ప్రతి ఇల్లు సందడిగా మారింది. ఈ ఐదురోజుల వేడుకల వివరాలను తెలుసుకునే ముందు... దీని వెనకనున్న నేపథ్యాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం.

అప్పుడెలా జరిగిందంటే..?
దాదాపు పదేళ్ల క్రితం(2004 అనుకుంటాను) అమ్మవారికి ఓ ఆలయాన్ని నిర్మించాలని ఆ ఇళ్లలోని పెద్దలు సంకల్పించారు. కీర్తిశేషులు పొడపాటి చంద్రయ్య(ప్రెసిడింట్), సుబ్బారావు, ఆయన కుమారులు, నాగేశ్వరరావు, ప్రసాద్, శ్రీను, అంజయ్యలతో పాటు మరికొందరు దీని నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి వరకు అమ్మవారిని పొడపాటి పాపయ్య(శేషయ్య కుమారుడు) ఇంట్లోని ఓ గదిలో ఉంచి.. పూజాదికాలు నిర్వహించే వారు. పొడపాటి ప్రవీణ్ ఆధ్వర్యంలో.. వారి స్థలంలోనే ఆలయ నిర్మాణం మొదలైంది. నాలుగైదు నెలల్లో ఆలయాన్ని పూర్తి చేశాక.. ఓ శుభముహూర్తంలో కొలుపులు కన్నుల పండువగా ప్రారంభించారు.
           పొడపాటి సుబ్బారావు, నల్లూరి దశరధరామయ్య రాజుమంత్రులు. మాతంగి ఆ ఏడాది ప్రత్యేక ఆకర్షణ(తర్వాత ఆ వ్యవస్థను రద్దు చేశారు). ఆ ఏడాది ఐదురోజుల పాటు ఉత్సవాలు అట్టహాసంగా సాగాయి. కొన్ని దశాబ్దాల తర్వాత ( ఓ వందేళ్లుగా అమ్మవారికి సంబంధించిన ఏ వేడుకా చేయలేదు) ఊరిలో నిర్వహించిన కొలుపులు కావడంతో.. ఆ వేడుకలు అందరికీ కొత్తగా కనిపించాయి. ప్రతి తంతునూ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అయితే అప్పుడప్పుడూ వర్షం కొద్దిగా ఇబ్బందులు పెట్టింది. ముఖ్యంగా కొత్తపట్నం వెళ్లేటప్పుడు. మొత్తంగా ఆ ఏడాది కొలుపులు అందరిలో ఒక నూతనోత్సాహాన్ని, ఐక్యతా భావాన్నితీసుకొచ్చాయి. తర్వాత నెల కొలుపులు. ఆనవాయితీ ప్రకారం ఐదేళ్ల తర్వాత మళ్లీ కొలుపులు నిర్వహించారు. అవి కూడా విజయవంతంగా ముగిశాయి.

ఇప్పుడు ఇలా మొదలైంది...
గడువు ప్రకారం కొలుపులు నిర్వహించాల్సిన సమయం సమీపిస్తుంది. ఇలాంటప్పుడు రెండు మార్గాలుంటాయి. మొదటిది మమ అనిపించి ముగించడం. రెండోది అత్యద్భుతంగా నిర్వహించడం. మొదటిది చాలా సుఖం... సులభం. ఖర్చు లేని పని. రెండోది చాలా కష్టం. డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేయాలి. అందరూ శ్రమపడాలి. ఆ ఐదు రోజులు పనులన్నీ మానుకోవాలి. ఆఫీసులకు సెలవులు పెట్టుకోవాలి. శరీరం సహకరించకపోయినా ఓపిక చేసుకోవాలి... ఇన్ని ఇబ్బందులున్నా సహజంగానే మనం ప్రతిసారీ రెండో మార్గాన్నే ఎంచుకుంటున్నాం.

దాతలు వీరు...
అయితే అప్పటికే ఆలయం కొంతమేర దెబ్బతింది. గోడలకు పగుళ్లిచ్చాయి. ఏం చేయాలి....? నేనున్నాను అన్నాడు పొడపాటి రమేష్. ఆలయ పునరుద్దరణకు అయ్యే ఖర్చు సమస్తాన్ని( సుమారు రెండు లక్షల రూపాయలు) భరించేందుకు ముందుకొచ్చాడు. పొడపాటి తులశమ్మ, బోడపాటి గోవిందమ్మ జ్ఞాపకార్థం ఆ మొత్తాన్ని అమ్మవారికి భక్తిగా సమర్పించుకున్నారు. ఇక విగ్రహం. ఇది ఉంటే ఆలయానికి వచ్చే కళే వేరు. విగ్రహం కూడా ఉంటే బావుంటుందని అందరూ భావించారు. దీంతో అమ్మవారికి అన్నీ సమకూరినట్లేననిపించింది. కానీ ఎలా..? విగ్రహం అంటే ఖర్చుతో కూడుకున్న పని. దీనికి పొడపాటి సీతారామయ్య ముందుకొచ్చాడు. రెండేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయిన భార్య ప్రమీల జ్ఞాపకార్థం విగ్రహాన్నిసమకూర్చేందుకు అంగీకరించాడు. ఈ వేడుకలు, ప్రతిష్ఠాపన తంతు నిర్వహించే బాధ్యతను పొడపాటి చంద్రశేఖర్(సుబ్బరాయుడి కుమారులు) తీసుకున్నారు. దీంతో వేడుకలకు వేదిక సిద్ధమైంది. ఐదారు నెలల క్రితం ఆలయ పనులు శాస్త్రోక్తంగా మొదలయ్యాయి. విగ్రహం కోసం కడప జిల్లా ఆళ్లగడ్డలోని ఓ ప్రముఖ శిల్పిని సంప్రదించారు. ఆయన ఆధ్వర్యంలో పనులు ప్రారంభమయ్యాయి. మధ్యమధ్యలో మన వాళ్లు వెళ్లి శిల్పం రూపురేఖల్ని పరిశీలించి వచ్చే వారు. ఇక కొలుపుల కోసం ఎవరికి తోచినంత వారు చందాలు ఇచ్చారు.

మొదటి రోజు ఇలా...
16వ తేదీ శుక్రవారం. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. విగ్రహ ప్రతిష్ఠకు ఇది ఆటంకమవుతుంని అందరూ కలవరపడుతున్న వేళ.. ఒక్కసారిగా మధ్యాహ్నానికి వర్షం ఆగిపోయింది. నింగి కడుపును చీల్చుకుంటూ సూర్యభగవానుడు ఏతెంచాడు. సాయంత్రానికి విగ్రహం కంపెనీ సెంటర్ వద్దకు వచ్చింది. చిరుదరహాసంతో ఉన్న గంగాభవానీ శిలా ప్రతిమను కనులారా తిలకించేందుకు వందల సంఖ్యలో భక్తులు అక్కడ గుమిగూడారు. డప్పుల మోతలు, బాణసంచాలతో ఆ ప్రాంతం మార్మోగింది. పూనకాలు మొదలయ్యాయి. దిష్టి తీయడంతో పాటు మరికొన్నిపూజల తర్వాత ఊరేగింపు ఆరంభమైంది. మెల్లగా ముక్తినూతలపాడు చేరుకుంది. గ్రామంలోని ప్రతి ప్రధాన వీధిలోనూ ఊరేగింపు కొనసాగింది. గ్రామస్తులందూ వారుపోసి, టెంకాయలు కొట్టి అమ్మవారికి ఘనస్వాగతం పలికారు.
                       శోభాయమానంగా సాగుతున్న యాత్ర పది నుంచి పదకొండు గంటల మధ్య గుడిమెళ్లపాడుకు చేరుకుంది. పొలిమేరలో టెంకాయ కొట్టి దిష్టితీశారు. గుమ్మడికాయలు పగులగొట్టారు. ఇక గంగాభవానీ గ్రామోత్సవం మొదలైంది. దాదాపు మూడు గంటల పాటు ప్రధాన వీధుల్లో అమ్మవారిని ఊరేగించారు. అందరూ హారతులిచ్చి ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఒంటి గంట ప్రాంతంలో విగ్రహం ఆలయం వద్దకు చేరుకుంది. ఇక అక్కడి నుంచి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాపన కార్యక్రమాలు మొదలయ్యాయి.

ప్రతిష్ఠాపన ఇలా...
పొడపాటి ప్రవీణ్, వెంకటస్వామిలు సతీసమేతంగా ప్రతిష్ఠాపన కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా అమ్మవారి విగ్రహం మునిగేలా ఒడ్లు పోశారు. తర్వాత ఉపవాసం ఉన్న మహిళలు అమ్మవారికి మంగళస్నానాలు చేయించి.. పట్టు వస్త్రాలు అలంకరించారు. 17వ తేదీ వేకువజామున మూడున్నర నుంచి నాలుగున్నర గంటల ప్రాంతంలో ప్రతిష్ఠాపన కార్యక్రమాన్నినిర్వహించారు. వేద మంత్రాల మధ్య.. ముందుగా మూలవిరాట్ ను గర్భాలయంలో ప్రతిష్ఠించారు. దాదాపు నాలుగు క్వింటాళ్ల బరువున్న ప్రతిమను యువకులందరూ ఆలయంలోకి తీసుకెళ్లారు. తర్వాత అమ్మవారి సోదరుడు పోతురాజు విగ్రహాన్ని... ఆలయానికి అభిముఖంగా ప్రతిష్ఠించారు. ఇక అమ్మవారి పాదుకలను పోతురాజు విగ్రహం వద్ద, మరో చిన్న విగ్రహాన్ని ఆలయంపై ఏర్పాటు చేశారు. ఇక అక్కడి నుంచి పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. కొంత విశ్రాంతి తర్వాత మధ్యాహ్నం కథా కాలక్షేపం, తర్వాత ఊరందరికీ భోజనాలతో ఆ రోజు కార్యక్రమం ముగిసింది. ఇక మరుసటి రోజు నుంచి కొలుపుల వేడుకలకు తెరలేచింది.


సాగరతీరానికి పయనం..
ఆలయాన్ని నిర్మించే సమయంలో..అమ్మవారి పాదుకలు, శూలం ఇతర సమగ్రిని ఆ ప్రాంగణంలోనే ఓ చిన్న షెడ్ నిర్మించి… దానిలో భద్రపరిచారు. 18వ తేదీ ఆదివారం అమ్మవారికి సముద్రస్నానం. దీని కోసం కొత్తపట్నం ప్రయాణం. బైనీడి వారు చెప్పినట్టు సూర్యదోయానికి ముందే బొల్లెద్దు, బొల్లావు సహా చిన్న ఊరేగింపుతో అమ్మవారిని పొలిమేర దాటించారు. ప్రయాణానికి నాలుగు ట్రాక్టర్లు సిద్ధమయ్యాయి. ఒక దాంట్లో అమ్మవారు. మిగిలిన దాంట్లో భక్తజనం. మనూరు, ముక్తినూతలపాడు నుంచి పదుల సంఖ్యలో బైక్ లు.  పదిగంటలకల్లా అన్నీ పొలిమేర దాటాయి. డప్పుల మోతతో అమ్మవారిని కొత్తపట్నం తీసుకెళ్లారు. ఇక అక్కడ బైనీడి వారి కథాగానం. అక్కడ వేట బలి, అమ్మవారి స్నానంతో పాటు అన్నీ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. ఈ కార్యక్రమం దాదాపు రెండుగంటల పాటు సాగింది.
                      ఆచారాలన్నీ పూర్తయ్యాక.. అందరూ సముద్రంలో కేరింతలు కొట్టారు. మద్యపానాలన్నీ మామూలే. ఇక మధ్యాహ్నానికి వంట సిద్ధమైంది. అంచనాలకు మించి జనాభా వచ్చారు. దీన్ని ఊహించి ముందుగానే ఏర్పాట్లు చేయడంతో అంతా ప్రశాంతంగా సాగిపోయింది. సాయంత్రానికి అందరూ ఊరికి బయలుదేరారు. అమ్మవారిని ఊరి పొలిమేరల్లోనే(శేషయ్యతాత కొష్టం వద్ద) ఉంచి రాత్రికి.. ఆచారం ప్రకారం కోడిని దిష్టితీసి, ఉడికించిన అన్నాన్ని వారుపోసి ఊరేగింపుగా ఊరిలోకి తీసుకొచ్చారు. ఆ సమయంలో కొద్దిపాటు జల్లు కురవడంతో ఊరేగింపును త్వరగా ముగించారు. సముద్రంలో మునిగి, ప్రయాణంలో అలసిపోయిన వారు ఆ రాత్రి సేదతీరారు.

మాతుడుపు...
కొలుపుల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టం మాతుడుపు. దీన్ని19వ తేదీ సోమవారం నిర్వహించారు. ఆ రోజు ఉదయం పూజల అనంతరం, బైనీడి వారు అమ్మవారి కథను గానం చేశారు. మధ్యాహ్నం వేళ పుట్టదగ్గర(మఠంగుంట దగ్గర) పూజలు చేసి, బొల్లావు, బసవన్నల సహా అమ్మవారి సామగ్రిని అక్కడ ఉంచి వచ్చారు. ఇక అక్కడి నుంచి మాతుడుపు. కొలుపులు చేసే కుటుంబాల్లోని వారందరూ పిల్లలతో సహా.. ఆలయం వద్దకు చేరారు. బైనీడి వారు రాజుమంత్రులతో పూజాకార్యక్రమాలు నిర్వహించారు. మాతంగి వేషం ధరించిన పురుషుడు.. వరుసగా కూర్చున్న అందర్నీ బియ్యం, వేపాకుతో ఆశీర్వదిస్తూ వెళ్లాడు. ఈ తతంగం మొత్తం ఉత్సాహభరితంగా, కేరింతల మధ్య ముగిసింది. మాతంగి వేషధారి రాజుమంత్రులను కొంతసేపు ఆటపట్టించారు.

ఉత్సాహంగా ఊరేగింపు..
ఇక రాత్రికి ఊరేగింపు. 8 గంటల సమయంలో వరప్రసాద్ పంతులు పూజతో ఇది మొదలైంది. అక్కడి మొదలు వేకువజామున నాలుగు గంటల వరకు ఊరుఊరంతా మోతమోగిపోయింది. మనూరి వాళ్లతో పాటు ముక్తినూతలపాడు నుంచి వచ్చిన వారు బొల్లెద్దు, బసవన్నలను ఎత్తుకుని డప్పుల మోతకు అనుగుణంగా నృత్యం చేశారు. దాదాపు అందరూ వీరతాళ్లు వేసుకున్నారు. అమ్మవారు రమేష్ ఇంటి ముందు నుంచి సెంటర్ వరకు రావడానికి మూడుగంటల సమయం పట్టిందంటే ఈ వేడుక ఎంత వైభవంగా జరిగిందో అర్థం చేసుకోవొచ్చు. గ్రామమంతా అమ్మవారికి హారతులిచ్చింది. ఇక మన కుర్రాళ్లు ఫణి పొడపాటి, సందీప్ కారుమూడి(పండు), అశోక్ కారుమూడి(ఒంగోలు), వెంకట్ పొడపాటిలు బొల్లెద్దులతో ఆడారు. చైతన్య, విష్ణు, కొండప్పచౌదరిలు వీరతాళ్లతో చెలరేగారు. పొడపాటి పాపయ్య, పొడపాటి నాగేశ్వరరావు, అంజయ్య(రెడ్డి), విశ్వనాథం, రాము, వేణు రావేళ్ల, కారుమూడి రాంబాబుతో పాటు ఇంకా ముక్తినూతలపాడు నుంచి వచ్చిన పొడపాటి వెంకట్రావు, సూదనగుంట వెంకట్రావు, ముళ్లూరి వెంకట్రావులు ఊరేగింపును విజయవంతం చేసిన వాళ్లలో ప్రముఖులు. మొత్తంగా వేకువజామున నాలుగున్నరకు ఊరేగింపు ఆలయం వద్దకు చేరుకుంది. అక్కడ ఓ వేటను బలిచ్చి.. ఊరేగింపును ముగించారు.

ఆఖరి అంకం..
వేడుకల్లో చివరిరోజైన మంగళవారం(20వ తేదీ) ఉదయాన్నే ఆడపడుచుందరూ అమ్మవారికి పొంగళ్లు పెట్టారు. అక్కడి నుంచి జమ్మి చెట్టు వరకు(చెరువు కట్ట మీద ఉంది) ఊరేగింపుగా వెళ్లారు. కథా శ్రవణంతో అక్కడి కార్యక్రమం ముగిసింది. ఇక ఆలయం వద్ద భోజనాలు మొదలయ్యాయి. ఐదు వేటల్ని కొట్టి అన్నాలు పెట్టారు. 600 అనుకున్న అంచనా 800కు పెరిగినా.. అప్పటికప్పుడు ఏర్పాట్టు చేసి అందరకీ కడుపారా భోజనం పెట్టి పంపించారు. ఇక సాయంత్రం భార్యభర్తల ప్రత్యేకపూజలు(పట్టాల కార్యక్రమం). ఆలయం ఎదురుగా దంపతుల్ని కూర్చోబెట్టి ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఘట్టంతో ఐదు రోజులు అట్టహాసంగా జరిగిన కొలుపుల సంరంభానికి తెరపడింది. నెలకొలుపులను(16 రోజుల పండుగ) 3 వ తేదీన నిర్వహించారు. రెండు వేటలను బలిచ్చి ఊరంతా భొజనాలు పెట్టారు. ముక్తినూతలపాడు నుంచి కూడా కొందరిని ఆహ్వానించారు.

మరికొన్ని సంగతులు....
1. ఆలయ ప్రహరీ నిర్మాణం త్వరలో మొదలవుతుంది. ఆ ఇళ్లలో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారు దీనికి విరాళాలిస్తారు.
2. ఆలయానికి ఆంప్లిఫైర్, మైక్ సెట్ ను అంజమ్మ(పొడపాటి గోవిందయ్య కుమార్తె) బహూకరించారు.
3. అందరూ తలా ఒక నగ కొనుక్కొచ్చి అమ్మవారి ప్రతిమకు అలంకరించారు.
4. మాతుడుపుకు అవసరమైన బియ్యం కోసం ఒడ్లను పొడపాటి స్వాతి, నల్లూరి యామిని దంచారు.
5. ప్రతిష్ఠ రోజు నాలుగొందుల కిలోల బరువున్న విగ్రహం ఓ పట్టాన పైకి లేవలేదు. పాపయ్య, సాంబయ్య, ప్రవీణ్, ప్రసాద్, లక్ష్మయ్య, రాము, వంశీ, విక్రమ్, గౌతమ్, రాజేష్, వెంటకస్వామి, అశోక్, సోము, ఫణి, గంగాధర్ .. ఇలా ఎంతో మంది శ్రమించి గర్భాలయంలోకి తీసుకెళ్లారు.
6. ఎంత భక్తి ఉన్నా బొల్లెద్దు, బొల్లావులను మోయడం చాలా కష్టం. ఊరేగింపు రోజు రాత్రంతా అందరం(జనార్దన్, హరికష్ణ, అశోక్, ఫణి, సాయి…) భుజాలు మార్చుకుంటున్నా.. గౌతమ్ మాత్రం ఆ బాధను భరించాడు.
7. వేడుకల కోసం మద్యాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు.
8. వయసు సహకరించకున్నా పొడపాటి పాపయ్య, నాగేశ్వరరావులు ఊరేగింపు చివరి వరకు చిందేస్తూనే ఉన్నారు.
9. ఊరేగింపు చివర్లో ఆలయం వద్ద రాజుమంత్రితో బలవంతంగా నృత్యం చేయించారు.
10. వీరతాళ్లు వేసుకోవడం సరిగా చేతకాకపోవడంతో... కొందరి చేతులు పగిలిపోయాయి.
11. పుట్ట వద్ద పొడపాటి రాము డప్పు కొడుతూ సందడి చేశాడు.
12. పొడపాటి విశ్వనాథానికి దేవర పట్టించాలని పుట్ట వద్ద ప్రయత్నించినా ఫలితం లేదు.
13. ఊరేగింపు తర్వాత మాతుడుపు చాలా సందడిగా జరిగింది.
14. కొత్తపట్నంలో పోటు మీదన్న సముద్రంలో మునగడం అందరికీ ఓ గొప్ప అనుభవం.
15. అక్కడి నుంచి వస్తూ కుర్రాళ్లలందరూ అప్పాయగుంటలో ఈతలు కొట్టారు.
16. ఊరేగింపు రోజు రాత్రి కారుమూడి కారుమూడి అశోక్, పొడపాటి పాపయ్యల డ్యాన్స్ హైలెట్.
17. ఈ ఐదురోజుల్లో ఎన్నో సార్లు ఆలయం వద్దకు గ్రామస్తులను ఆహ్వానించాల్సి వచ్చింది. 
      ఆ బాధ్యతంగా నల్లూరి రంగనాయకులు తీసుకున్నారు.
18. వేడుకలను చాలా మంది హ్యాండీక్యామ్ లు, కెమెరాలు, సెల్ ఫోన్లలో బంధించారు.
20. ప్రతిష్ఠ కార్యక్రమాలను నిర్వహించిన పొడపాటి చంద్రశేఖర్ కు బట్టలు పెట్టి సత్కరించారు.
19. కొంతమందికి సొంతకార్లున్నా.. కొత్తపట్నానికి మాత్రం అందరితో పాటు పిల్లలతో కలిసి ట్రాక్టర్లలోనే వచ్చారు.

చివరిగా....
పదుగురు పంచుకోని సంతోషమేదైనా.. పచ్చికైన పెంచలేని ఎడారి వాన.... 
అంటారు సిరివెన్నెల సీతారామశాస్ర్తి
ఇది గ్రామంలోని కొన్ని కుటుంబాల(పెద్ద పొడపాటివారితో పాటు నల్లూరి, బెజవాడ)కు చెందిన ఓ వేడుక. అయినా ఊళ్లోని వారందరూ దీనిలో భాగస్వాములయ్యారు. ప్రతిఘట్టంలోనూ పాలుపంచుకున్నారు. అన్ని సందర్భాల్లోనూ తోడుగా నిలబడ్డారు. స్నేహాల వల్లో, మంచితనం వల్లో... పక్క ఊళ్లలోని వాళ్లు కూడా చేతనైనంత సాయం చేశారు. ఆరోగ్యం సహకరించపోయినా మాజీ సర్పంచ్ కామేపల్లి శ్రీనివాసరావు కొత్తపట్నం వరకూ వచ్చారు. దేవుడు, దేవర అనేవి వాస్తవం కావచ్చు.. కాకపోవచ్చు. కానీ చిన్నచిన్నగొడవలు, అభిప్రాయభేదాలు, ఇతర కారణాలతో దూరమైన వారి మధ్య ఇలాంటి వేడుకలు వారధిగా పనిచేస్తాయి. తప్పక మాట్లాడుకోవాల్సిన పరిస్థితులను కల్పిస్తాయి. మనమంతా ఒకటే అని, ఒకే తల్లివేరు నుంచి వచ్చామనే విషయాన్ని గుర్తు చేస్తాయి. పాత బంధుత్వాలను జ్ఞప్తికి తెచ్చి, కొత్త బంధాలను కలుపుతాయి. మనం అనే ఓ భావనను అందరి గుండెల్లో నాటతాయి. మన వెనుక ఇంత మంది ఉన్నారనే ఓ భరోసానిస్తాయి. ఇలాంటి వేడుకల పరమార్థం ఇదే. అప్పుడు మాత్రమే ఈ వేడుకలు విజయవంతమయినట్టు. ఈ వేడుకలు నూటికి నూరు శాతం కాకపోయినా.. చాలా వరకు ఆ బాధ్యతను నెరవేర్చాయి. తర్వాత జరిగే వినాయకచవితైనా, అంకమ్మతల్లి కొలుపులైనా, సంక్రాంతి సంబరాలైనా, శ్రీరామనవమి వేడుకలైనా.. ఈ సహద్భావ వాతావరణాన్ని, ఐకమత్యాన్ని మరింతగా పెంపొందించాలన్నదే అందరి ఆశ.. ఆకాంక్ష.

ఆ గంగమ్మతల్లి కరుణా కటాక్ష వీక్షణాలు అందరిపై ప్రసరించి.. 
ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగజేయాలని కోరుకుంటూ...

(వేడుకలకు సంబంధించి నాకు గుర్తున్న విషయాలు ఇవి. వ్యాసం నిడివి దృష్ట్యా కొన్ని చిన్నవిషయాలను వదిలేశాను. ముఖ్యవిషయాలను మాత్రం ప్రస్తావించాననే అనుకుంటున్నాను. ఒకవేళ నేనేదైనా పొరపాటుగా రాసినా, ముఖ్య విషయాన్ని విస్మరించినా నా దృ ష్టికి తీసుకురండి. వెంటనే మారుస్తాను. ఎందుకంటే కొన్నేళ్ల తర్వాత వేడుకలు ఎలా జరిగాయో మనకు గుర్తుండదు. అప్పుడు మనకు రిఫరెన్స్ కచ్చితంగా ఇదే. అందుకే పొరపాట్లు లేకుండా చూసుకుందాం. మరిన్ని ఫొటోలను వీలైనంత త్వరగా అప్ లోడ్ చేస్తాం.)  

- అశోక్ పొడపాటి
                                                                                        తేదీ: 1-09-2013
Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved