మన ఊరు.. మన బడి.. మన జెండా పండుగ



ఓ పదిహేనేళ్ళ క్రితం ఇదే రోజు...

చీకటి తెరలు పూర్తిగా తొలగిపోక మునుపు... 
వెలుగు రేఖలు పూర్తిగా విచ్చుకోక మునుపు... 
పిల్లలందరూ బడి దగ్గర గుమిగూడే వారు...

ఆడ పిల్లలందరూ 
ఎవరికి  తెలిసిన ఇళ్ళ దగ్గరకు వాళ్ళు వెళ్లి రంగురంగుల పూలు తెచ్చేవారు.
మగ పిల్లలందరూ....
మైదా ఉడకపెట్టే పనిలో ఉండే వారు...

కొందరు బడి ఆవరణ శుభ్రం చేస్తూ....
మరి కొందరు జెండా కోసం గుంతలు తీస్తూ..
ఇంకొందరు బడిని రంగు కాగితాలతో అలంకరిస్తూ...
మిగిలిన వారు జెండా కొయ్యకు కాగితాలు చుడుతూ.....

ఇంతలో దేవదానం సార్ చాక్లెట్లు, బిస్కెట్ల కవర్లతో  వచ్చేవారు.
ఆయనతో పాటే ఊర్లోని కుర్రోళ్ళు, కొందరు పెద్దోల్లు....

అలంకరణ పూర్తయ్యాక పిల్లలందరూ ఇళ్ళకు పరుగులు తీసి....
స్నానాలు చేసి, కొత్త బట్టలతో రంగు రంగుల సీతాకోక చిలుకల్లా వచ్చేవారు...
ఇక బడి ముందు అసెంబ్లీ.
మొదట దేశ నాయకుల గురించి, స్వాతంత్ర్య దినోత్సవం గురించి సార్ పిల్లలకు వివరించెవారు...
తర్వాత వందేమాతరం, ప్రతిజ్ఞ..
పిల్లల పాటలు.
పోటీల విజేతలకు బహుమతులు.... 

ఇది జరుగుతున్నప్పుడే ఆడ,.  మగ తేడా లేకుండా అందరూ అక్కడ చేరేవారు.
మధ్యలో పిల్లల ముసిముసి నవ్వులు. 
ఆఖరున జనగణమన... 
తర్వాత మిటాయిల పంపిణీ. 

దేవదానం సార్ పున్యమ్.... 
మన ఊర్లో పిల్లలతో పాటు చాలా మంది పెద్దలకు గాంధీ అంటే ఎవరో.... 
నెహ్రు అంటే ఎవరో తెలిసింది.. 
జెండా పండుగ అంటే అవగాహన కలిగింది.
తర్వాత గోవిందు, లారెన్స్, ఇప్పుడు అనురాధ...
పిల్లల సంఖ్య తగ్గినా, పెద్దలు పట్టించుకోకపోయినా... 
ఏదోలా జరుగుతూనే  ఉంది...

జాతి మొత్తం  అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటున్న ఈ  శుభవేళ... 
మనకి అదనంగా ఈ బాల్య స్మృతులు...

అందరికీ మరొక్కసారి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

                                                                                                                                   అశోక్ పొడపాటి 
                                                                                                                                  తేది- 15-8-2013






  
Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved