'చింత'లు తీర్చిన చెట్టు


ఈ చింత చెట్టు ప్రస్తావన లేని మన జీవితాలు, మన వైబ్ సైట్ పూర్తిగా అసంపూర్ణం.. అసమగ్రం
ఎందుకంటే మన జీవితంలోని కొన్ని మధుర ఘట్టాలు దీనితో ముడిపడి ఉన్నాయి.
నాకు ఊహ తెలిసే నాటికి చెట్టు ఎలా ఉందో.. ఇప్పటికీ అలాగే ఉంది.
అయితే కొన్ని కొమ్మలు విరిగాయి.. మరికొన్ని చిగుళ్లు కొత్తగా వెలిశాయ్.

కంపెనీ సెంటర్ నుంచి దాదాపు రెండున్నర కిలోమీటర్లు ఎండల్లో, వానల్లో నడిచి వచ్చిన వారికి.... 
ఊళ్లోకి వచ్చేశాం.. ఇక పర్లేదు అనే మొదటి భరోసా ఇచ్చేది ఈ చింత చెట్టే.
అంత దూర ప్రయాణంతో అలసి, సొలసి పోయిన వారు ముందుగా సేద తీరేది ఈ చెట్టు కిందే.
ఎండలో పడి వచ్చిన వాళ్లు... అమృతం వంటి చెర్లో నీళ్లు తాగి దీని కింద కూర్చోవడమంటే..
స్వర్గంలోకి కల్పవృక్షం కింద కూర్చోవడమే.
ఐస్ లు, కూరగాయలు, వస్త్రాలు ఇలా ఏవి అమ్మే వారు వచ్చినా.. 
వారి మొదటి మజిలీ చింత చెట్టు. గిరాకీ దొరికే చోటూ ఇదే.
అలాగే వారికి ఆఖరిగా వీడ్కోలు పలికేది ఈ చింత చెట్టే.
ఇప్పుడంటే ఊళ్లో వీధుల్లో కూర్చునే అలవాటు పోయిందిగానీ... నాలుగేళ్ల క్రితం వరకు చింతచెట్టు కింది రెండు అరుగులు(తూములు) ఖాళీగా ఉండేవి కావు. మగవాళ్లతో పాటూ ఆడవాళ్లూ అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకునే వారు. సమీప ఇళ్ల వారు అక్కడే బట్టలు ఉతుక్కునే వారు.

ఇక స్కూల్ పిల్లలు వ్యాన్ వచ్చేంత వరకు ఆడుతూ పాడుతూ గడిపేది ఆ నీడ లోనే.
కావిళ్ల బరువుతో అలసిన వారు అలుపు తీర్చుకునేదీ ఆ చెట్టు కిందే.
ఇక ఇప్పటి తరం కుర్రాళ్లకు ఆ చెట్టుతో విడదీయరాని అనుబంధం.
ఊహ తెలిసినప్పటి నుంచి ఆ చెట్టు కింద ఆడుకున్న ఆటలు కోకొల్లలు.
రాళ్లతో, కర్రలతో చెట్టు కాయల్ని కొట్టని వాళ్లు మనల్లో దాదాపు లేరు.
ఆ కాయల్ని ఉప్పు, కారంలో అద్దుకుని.. ఆ తూములపైనే తినని వారూ అరుదు.
ఇప్పుడు చెట్టు కింద అంతా శుభ్రంగా ఉందిగానీ.. ఒకప్పుడు పిచ్చి మొక్కలు పుష్కలంగా ఉండేవి.
ఆ పక్కనే సగం కూలిన గోడ. వీటితో ఓ వైపు పాముల భయం వెంటాడేది.
అయితే ఆ కాయల రుచి ముందు ఆ భయం బలాదూర్.
ఆ చెట్టు ఎక్కి కొమ్మలు విరవడమూ ఓ సరదా.

మొత్తంగా..
మన ఊరిలోని చాలా వైభవాలకు, పతనాలకు ఇది సాక్షి. 
ఎన్నో అనుభూతులకు ఇది వేదిక.
చాలా మంది చింతలు తీర్చిన చెట్టు.
కష్టాలు విన్న చెట్టు.. కుట్రలు చూసిన చెట్టు.
అందరి ఆఖరి మజిలీలు దీని నీడలోనుంచే. దింపుడు కళ్లమూ దీని సమీపంలోనే.
ఇప్పుడిది బలహీన పడి ఉండొచ్చు.
పెద్దగాలి కొడితే కూలేలా ఉండొచ్చు.
కొత్త చిగుళ్లు లేక కళను కోల్పోయి ఉండొచ్చు.
అయినా ఇది మన ప్రతిష్ఠ. మన చరిత్ర.. 
అంతెందకు ఇది మనకు గొప్ప.. ఎంతంటే జీవితాంతం గుండెల్లో పెట్టుకునేటంత.

నీడని, కాయల్ని, పూతల్ని, చల్లగాలుల్ని పంచి.. మన జీవితాలను మరింతగా శోభిల్లచేసి.. ఎన్నో మధురానుభూతుల్ని పంచిన ఈ చెట్టు గురించి ఇలా చర్చించుకోవడం అంటే.. ఆ రుణంలో కొంతైనా తీర్చుకోవడమే.
అన్నట్టు.. ఈ మధ్య ఊరికి వెళ్లిన వారిలో ఈ చెట్టును ఎంత మంది పరిశీలనగా చూశారు..?

ఈ చెట్టు గురించి నాకు గుర్తున్నవి, అనిపించి నవీ ఇవి. 
అలాగే మీకు గుర్తున్నవీ, అనిపించినవీ కూడా మనవాళ్లతో పంచుకోండి.
ఇది అందరికీ సంబంధించి. కనుక అందరూ పంచుకున్నప్పుడే ఇది సంపూర్ణమవుతంది.
లేకపోతే ఇది అసమగ్రం.
వీలైతే మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ధన్యవాదాలతో.
                                                                                                                                         
                                                                                                                                                                                                                                                                                                                                                              
                                                                                                                                    అశోక్ పొడపాటి
                                                                                                                              21-06-2013(శుక్రవారం)
     
Share this article :

+ comments + 1 comments

June 27, 2013 at 8:14 AM

ఆ చెట్టు చాల ప్రత్యెక మైనదిగా చెప్పొచ్చు చాల బాగా చెప్పావ్ అశోక్ ,ఒక్కసారిగా ఒక 15 సంవత్సరాల వెనక్కి తీసుకేల్లావ్ ,మనందరం ఊరెల్లి నప్పుడల్లా చూస్తూనే ఉంటాం ... నిజంగా ఇది ఇంకా ఎవరి బారిన పడకుండా సజీవంగా బ్రతికే ఉందంటే మన అదృష్టం ... ఎన్ని ఆటలు ఈ చెట్టు దగ్గర ,దీని చింత కాయలు కొట్టటానికి పెద్ద లావుటి కర్రలు తెచ్చి విసిరి విసిరి వేసే వాళ్ళం. అబ్బ చెట్టు చితరుకి పైకి ఎక్కి బలే ఉండేది నిజం గానే ,ఎండాకాలం సెలవుల్లో ఆ చెట్టు కండ ఉన్న తూములు దగ్గర కుర్చుని అవసరం ఉన్న లేకపోయెన ఏదేదో మాటలు మాట్లాడుకుంటూ బాగా సరదాగా గడిపేవాళ్ళం . పొద్దు పొద్దునే ఈనాడు పేపర్ కోసం ఐతే అక్కడే కుర్చుని తెగ ఎదురు చూసే వాళ్ళం బగా ఎండా వచ్చే దాక అక్కడే ఉండే వాలం
సెలవుల్లో మరి ఎక్కువుగా .... ఆ ఒకటి కాదు లే మోత్హానికి మన చింత చెట్టు మనల్ని చాల బాగా ఆదరించిడనే చెప్పలబ్బ గట్టిగా ... వీలైతే దాన్ని కాపాడటానికి ఇంకా ఎక్కువ రోజులు సజీవం గా ఉంచ టానికి ప్రయత్నిదామ్ ...

,

Post a Comment
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved