వద్దంటే వస్తుంది ...

 ఈరోజుల్లో కాన్సర్ అనేది సరదాగా వస్తుంది .... మనం వీలైనంత వరకు జాగ్రత్తగా ఉంటేనే... చూడండి ఒకసారి చదవండి మన జిల్లా లో మన లాంటి ఒక ఊర్లో ..... 


ఊరికి కేన్సర్
పదేళ్లలో 39 మంది మృతి
కుటుంబంలో నలుగురికి ఆ మహమ్మారి
విషంగా మారిన తాగునీరు
కన్నీరు పెడుతున్న చిన్న ఓబినేనిపల్లె

బేస్తవారిపేట  ఆ గ్రామంలో ప్రజల ప్రాణాలను కేన్సర్ మహమ్మారి కబళించివేస్తోంది. గత పదేళ్లలో ఆ ఊరికి చెందిన 39మంది కేన్సర్‌కు బలయ్యారు. మరెందరో మృత్యువుతో పోరాడుతున్నారు. ప్రకాశం జిల్లా బేస్తవారపేట మండలంలోని చిన్న ఓబినేనిపల్లి గ్రామం దీనగాథ ఇది. తాజాగా ఆదివారం.. ఈ ఊరికే చెందిన కె.నారాయణమ్మ (70) అనే మరో వృద్ధురాలు గుంటూరులో కేన్సర్‌కు చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ ఊళ్లో పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా.. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదు.

50 ఏళ్లు దాటితే..
చిన ఓబినేనిపల్లి జనాభా సుమారు 2 వేలు. గ్రామంలో తాగునీటికి ఓవర్‌హెడ్ ట్యాంకులు లేవు. చేతి పంపులు, బోరు నీరే ఆధారం. ఈ నీళ్లలో ఫ్లోరైడ్ శాతం ఆందోళనకర స్థాయిలో ఉంది. ఫ్లోరైడ్ కారణంగా 20 ఏళ్ల యువకులు.. 30 ఏళ్ల వారిలా కనిపిస్తారు. ఐదు పదులు దాటాయంటే.. వారికిక నడవడానికి కర్ర ఊతం కావాల్సిందే. తమ దీనస్థితి గురించి ఇప్పటికి ఎన్నోసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గ్రామస్థులు వాపోతున్నారు. దీనికితోడు.. యాభైఏళ్ల వయసు దాటినవారిలో కేన్సర్ ముప్పు నానాటికీ పెరిగిపోతోంది.

ఊళ్లో ఏడాదికి ఇద్దరు, ముగ్గురు చొప్పున కేన్సర్ వ్యాధితో మృత్యువాత పడుతున్నారు. కేన్సర్‌తో వారి ఆర్థిక స్థితిని సైతం దిగజారిపోతోంది. ఉదాహరణకు.. దేశబోయిన సరోజమ్మ అనే బాధితురాలు కేన్సర్ చికిత్స కోసం ఇప్పటికి రూ.2 లక్షల దాకా ఖర్చు పెట్టారు. వ్యవసాయ భూమి అమ్మి మందులు వాడుతున్నారు. ఇనుగూరి రామసుబ్బయ్య అనే మరొకవ్యక్తి పదేళ్లుగా కేన్సర్‌కు చికిత్స చేయించుకుంటున్నారు. ఇప్పటిదాకా అయనకు అయిన ఖర్చు అక్షరాలా రూ.6 లక్షలు. తాగునీటి వల్లే ఈ మహమ్మారి తమను కబళిస్తోందని గ్రామస్థులంతా ముక్తకంఠంతో అంటున్నారు.

అయితే, వైద్యులు మాత్రం ఫ్లోరైడ్ నీటి వల్ల కేన్సర్ రాదని స్పష్టం చేస్తున్నారు. "ఫ్లోరైడ్ నీరు తాగడం వల్ల కీళ్లనొప్పులు, పళ్లు గార పట్టడం, ఎముకలు బలహీనమై చిన్నవయసులోనే కర్ర ఊతంతో తిరగాల్సి రావడం వంటి ఇబ్బందులు ఉంటాయి తప్ప కేన్సర్ రాదు'' అని హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో కేన్సర్ వైద్య నిపుణుడు టి.ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. అందునా.. చిన ఓబినేని పల్లిలో ఇప్పటిదాకా ఎక్కువమంది ఊపిరితిత్తుల, పేగు కేన్సర్లతో చనిపోయారు. ఫ్లోరైడ్ వల్ల ఈ రెండు రకాల కేన్సర్లూ వచ్చే ప్రమాదం అస్సలు లేదని ఆయన వివరించారు.

పోనీ, బాధితులకు పొగతాగే అలవాటు ఉందా అంటే అదీ లేదు. పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఫ్యాక్టరీలూ లేవు. మరి ఇంత మందికి కేన్సర్ ఎందుకు వస్తోందనే ప్రశ్నకు సమాధానం దొరకట్లేదు. గ్రామ పరిసరాలను, అక్కడి తాగునీటిని నిపుణులు పరిశీలిస్తేగానీ అసలు విషయం వెల్లడి కాదని కిమ్స్ వైద్యుడు ప్రతాప్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే, రెండేళ్ల క్రితం గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటు చేశాక.. అందరూ ఆ నీటినే కొనుగోలు చేస్తుండటంతో కొత్తగా కేన్సర్ బారిన పడేవారి సంఖ్య తగ్గడం గమనార్హం...

Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved