వేపచెట్టుపై జ్ఞాపకాల పందిరి

ఇది ఇప్పటి సంగతి కాదు. అంటే మనూరు ఒంగోలులో భాగమైనప్పటి సంగతి కాదు. గుడిమెళ్లపాడు.. ఓ పల్లెటూరుగా ఉన్నప్పటి సంగతి. మట్టి కుండల్లో నీరు తాగినప్పటి సంగతి. కలర్ టీవీలు, సెల్ ఫోన్లు, ఏసీలు ఇంకా ఊర్లోకి రానప్పటి సంగతి. ఎడ్లతో వ్యవసాయం చేసినప్పటి సంగతి. చెరువు నిండా మంచి నీరున్నప్పటి సంగతి. వాగు పారి ఊరి చుట్టూ వరి పండినప్పటి సంగతి. మనూరి బడి నిండా పిల్లలున్నప్పటి సంగతి. రాముల వారి కళ్యాణం కన్నులపండువగా జరిగినప్పటి సంగతి. సంధ్య వేళకి ఊర్లోని అరుగులన్నీనిండిపోయినప్పటి సంగతి. ఆ వీధిలోని ఆడవాళ్లందరూ ఒకచోట చేరి కబుర్లు చెప్పుకున్నప్పటి సంగతి. ఊరుమ్మడి వినాయక చవితి అన్న ఊహే లేనప్పటి సంగతి. రాజకీయ విషం ఇంకా పూర్తిగా ఎక్కనప్పటి సంగతి. ఊరి నలువైపుల్నీ చిల్లచెట్లు కమ్మేసినప్పటి సంగతి... ఒక్కమాటలో చెప్పాలంటే రియల్ ఎస్టేట్ భూమ్ రానప్పటి సంగతి. ఎప్పుడు ఎవరితో ఏ అవసరం వస్తుందో అన్న భయంతో అందరూ(కాకపోయినా చాలా మంది) కలసి ఉన్నప్పటి సంగతి..

        రుణానుబంధరూపేణ పశు-పత్ని-సుత-ఆలయం అన్న పెద్దలు ఎందుకో చెట్టును మర్చిపోయారు. బహుశా చెట్టు ప్రాముఖ్యాన్ని ప్రత్యేకంగా చెప్పాలా అన్నఉద్దేశంతోనేమో..? నేను ఇప్పడు చెప్పబోయేది అలాంటి ఒక ప్రశస్తమైన చెట్టు గురించి. ఎంతో మందికి సంబంధించిన ఎన్నోమరపురాని జ్ఞాపకాలకు నెలవై, హద్దులు లేని ఆనందాలకు ఆలవాలమై, ఒక జీవితానికి సరిపడా అనుభూతులను పంచిన ఓ కల్పవ్రుక్షం గురించి. ఈ అనుభూతులు, జ్ఞాపకాలగోల మాకేల అనుకునేవాళ్లు.. మీ విలువైన సమయాన్ని వ్రథా చేసుకోకుండా దయచేసి ఇక్కడితో చదవడం ఆపేయండి. ఓపికున్న వాళ్లు నాతోపాటు టైమ్ మెషిన్ ఎక్కి పదిహేనేళ్ల వెనక్కి ప్రయాణించడానికి సిద్ధంకండి.

   కల్పవృక్షం దేవేంద్రుడి పెరట్లో ఉంటుందని... అది ఏది కోరుకుంటో అది ఇస్తుందని చిన్నప్పుడు మా నాయన్నమ్మ చెప్పినట్టు గుర్తు. తర్వాత ఈ విషయాన్ని మన దేవదానం సార్ నేను మూడోతరగతిలో ఉన్నప్పుడు ధ్రువీకరించారు అనుకోండి. అప్పటి నుంచి మా ఇంటి ముందున్న వేపచెట్టు నాకు కల్పవ్రక్షంగానే కనిపించేది. నేను పుట్టినప్పుడు వేపచెట్టునాటానని మా నాయనమ్మ నాకు చెప్పేది. ఆ విషయం నిజమైనాకాకపోయినా నాకు నచ్చింది కాబట్టి నేను నమ్మాను. నాకు ఊహతెలిసే నాటకి మన ఊరు బడి రామస్వామిగారి కొష్టంలో ఉండేది. దేవదానం, నాగేశ్వరరావు సార్లు అక్కడ పాఠాలు చెబుతుండే వారు. మరో బడి లేదు కాబట్టి, పిల్లల్నిఒంగోలు పంపి చదివించాలనే ఆలోచన అప్పటి పెద్దవాళ్లకు లేదుకాబట్టి.. ఊళ్లోని పిల్లలందరూ అక్కడే చదివే వారు. కొంచెం ముందు వచ్చిన వాళ్లు మా ఇంటి ముందున్న వేపచెట్టు కిందకు వచ్చేవారు. ఒక్కోసారి టీచర్లు రావడం ఆలస్యమైతే దాదాపు మధ్యాహ్నం వరకు అక్కడే ఉండేవారు. ఆ ఆకులు, కొమ్మలు కాయలతోనే కాలక్షేపం. పైకి ఎగిరి కొమ్మల్ని అందుకుని ఊగుతున్న వాళ్లని చూసి మా నాయనమ్మ కేకలేస్తే పరుగులు తీసేవాళ్లు.

        అప్పట్లో ఇంట్లో గడియారం ఉండటమే కష్టం. ఇక అలారం లాంటి వాటి సంగతి కల్లో సంగతి. ఈ దరిద్రం తెలిసో.. ఏమో దేవుడు మాకు రెండు నడిచే అలారాల్ని ప్రసాదించాడు. ఒకటి శివ.. రెండు చక్రఫాణి. అప్పుడప్పుడు చైతన్య. ఎండాకాలంలో అయితే ఉదయం ఏడుగంటలకు, వానాకాలంలో అయితే ఎనిమిది గంటలకు ఠంచనుగా వచ్చి మమ్మల్ని నిద్రలేపే వాళ్లు. అప్పుడే తెల్లారిందా అనే మా నాయనమ్మ మాటల్ని మేము విన్నట్టే ఉండేవాళ్లం. ఇప్పటి పిల్లల్లా హోమ్ వర్క గొడవలు పెద్దగా లేకపోవడంతో వేపచెట్టు నీడలో చక్కగా ఆడుకునేవాళ్లం.

        ఇక ఆ వైపు ఇళ్లలోని ఆడవాళ్లందరూ ఉదయం పూట పనులు పూర్తికాగానే ఒక్కొక్కరిగా ఆ చెట్టు నీడకి చేరేవారు. బాపమ్మ నాయనమ్మ, ఇందిరమ్మ ఆమ్మ, చేలో సింగమ్మ, ఉమా ఆమ్మ, సుకన్య పిన్ని,కొన్నాళ్లు పార్వతమ్మ, ఇంకా శ్రీలక్ష్మిలు(ఇద్దరు), రమ, సుబ్బమ్మ, శేషమ్మ నాయనమ్మ, ఇంకా అప్పుడప్పుడు నిర్మల.. ఇలా దాదాపు ఎప్పుడూ ఓ పదిమందికి తగ్గకుండా అక్కడ ఉండేవాళ్లు. టీవీలో చూసిన సినిమాల గురించి, కొన్న వస్తువుల గురించి, పాడి గురించి, ముఖ్యంగా అక్కడ లేని వారి గురించి ఉన్నవీ లేనివీ చెప్పుకునే వారు. చీరలు, పాత్రలు అమ్మే వాళ్లు వచ్చినప్పుడు కేకేసి సగానికి సగం బేరాలాడి.. చాలా సందర్భల్లో చివరకు ఏమీ కొనకుండా పంపిచే వాళ్లు. ఇక ఆకలేసినప్పుడు చంద్రయ్య(ప్రెసిండెంట్)తాత, నాగేశ్వరరావు పెదనాన్న, రమేష్ బాబాయ్ లు కేకలేసుకుంటూ అక్కడికి వచ్చే వారు. కొంత సేపటికి వాళ్లు కూడా కబుర్లతో కూల్ అయిపోయి.. వచ్చిన పని మర్చిపోయి చెట్టు కింద మంచం వేసుకుని నిద్రపోయేవాళ్లు. ఇక ఎప్పటికో ఇంటికి బయలుదేరి వెళ్లే వాళ్లు.

    ఇక కోతికొమ్మచ్చి. క్రికెట్ రాక ముందు మన గ్రామ క్రీడ. ఓ దశాబ్దం పాటు మనం ఆడుతూనే ఉన్న ఆట. ఎక్కువగా మావేప చెట్టు మీదే ఆడేవాళ్లం(బహుశా చిన్నదవడం వల్ల కావచ్చు). దాదాపు ఊర్లోన్ని పిల్లలందరూ ఆడిన ఆట. చుట్టం చూపుగా వచ్చిన భరత్ లాంటి వాళ్లు కూడా అలవాటుపడిన ఆట. నేను, చిరు, చక్రి, చైతు, శివ, గంగాధర్ ఎక్కువగా ఆడేవాళ్లం. ఇక తర్వాత సురేంద్ర, అమరేంద్ర, ఫణి, పండు, విష్ణు, నరేష్ లు కొంతకాలం ఆడారు. ఇక రాజేష్, మధు, రామయ్య, పీఎస్, కరుణ, టింకు, జనలు ఎప్పుడున్నా వచ్చే గౌరవ ఆటగాళ్లు. ఇక ఈ ఆటలో చక్రి, గంగాధర్ ఎక్స్ పర్ట్స్. చెట్టు నీడలో ఉండే గేదెలకు తగలకుడా, వాడి పేడలో కాలు వేయకుండా కిందకు దూకడం వారికి మాత్రమే సాధ్యమైన కళ. పొడుగ్గా ఉండటం ఒకరికి, చలాకీగా ఉండటం మరొకరికి మంచి అడ్వాంటేజ్. చెట్టు ఎక్కడం సరిగా రాని ఫణి చెట్టు మొదల్లో కొమ్మని వాటేసుకుని కూర్చోవడం ఓ జ్ఞాపకం. ఈ ఆట ఆడుతున్నంత సేపు ఒకరు చిటారు కొమ్మన కూర్చుని ఎవరన్నా వస్తున్నారేమోనని అబ్జర్వ్ చేస్తుండేవాళ్లు. ఇక వేపకాయలతో ఒకరి నెత్తి మీద ఒకరు కొట్టుకోవడం ప్రతి వేసవిలో అతిసాధారణంగా కనిపించే సన్నివేశం. ఒకరిద్దరు ఏడుస్తూ వెళ్లడం కూడా సాధారణమే. ఇది బోర్ కొట్టినప్పుడు ఆ చెట్టు కిందే గోలీలాట ఆడేవాళ్లం. అదీ విసుగుపడితే బొంగరాలు పట్టుకునేవాళ్లం. అప్పుడప్పుడూ కర్రాబిళ్లా కూడా.

             వేపచెట్టుపై పందిరి. అప్పట్లో జెమినీటీవీలో భూమ్ భూమ్ షకలక అని ఓ సీరియల్ వచ్చేది. దానిలో హీరో ఓ స్కూల్ పిల్లాడు. దానిలో తన ఫ్రెండ్స్ తో మాట్లాడుకోవడం చెట్టుపైన ఓ ఇల్లు కట్టుకుంటాడు. దాని పేరు ట్రీ హౌస్. ఆ ఇన్ స్పిరేషన్తో వేపచెట్టు మీద నేనూ ఓ పందిరి వేశాను. దాని కోసం మిట్ట మధ్యాహ్నం వాగు దగ్గరకు వెళ్లి చిల్లచెట్లు కొట్టుకుని వచ్చి, వాటితోలు తీసి నున్నగా చేసి, పొగాకు బ్యారన్ల దగ్గరకు వెళ్లి తాళ్లు తెచ్చి కట్టేవాణ్ని. మా ఎండాకాలపు మధ్యాహ్నాలన్నీ అక్కడే గడిచిపోయేవి. దాని మీద, చుట్టుపక్కల ఓ పదిమందిమి కూర్చొనేవాళ్లం. కొన్నాళ్లకు దానికి పోటీగా చిరు మరోటి కట్టాడు. అలా అందరం చెట్టు మీదనే ఊరేగేవాళ్లం. ఓ సారి చిల్లచెట్లు కొట్టడానికి వెళ్లినప్పుడు వెనక చప్పుడైతే తిరిగి చూశా.. పెద్ద పాము. గొడ్డలిని అక్కడే వదిలేసి పరుగోపరుగు. మళ్లీ ఓ అరగంట తర్వాత వచ్చి కట్టెల్ని, గొడ్డల్ని తీసుకెళ్లాను. అప్పట్లో పౌరాణిక సినిమాలు చూసి తయారు చేసుకున్న బాణాల్ని… పాండవులు ఆయధాల్ని శమీ వృక్షం మీద దాచినట్టు.. మేము వేపచెట్టు మీద దాచేవాళ్లం.

            అప్పట్లో ఓ సారి ఆ చెట్టు కింద నేను, రాజేష్ అన్న ఎదురెదురుగా నుంచుని బాణాలు వేసుకున్నాం. అవి తగిల్తే ఏంటా అని అప్పుడు ఆలోచించలేదుగానీ…. ఇప్పుడు ఆలోచిస్తుంటే భయం వేస్తుంది. పండు వేపకాయలు తింటే ఆరోగ్యానికి మంచిదని మనూరి వాళ్లు ఎవరో చెప్పడంతో కొన్నాళ్లు తెగతిన్నాం. మా ఇంట్లో ఉండే మూడు మంచాలు ఎప్పుడూ వేపచెట్టు కింద ఉండేవి. వాటి మీద ఎప్పుడూ ఎవరో ఒకరు ఉండేవాళ్లు. వారానికి ఒకసారి లూజు లాక్కోవాల్సి వచ్చేది. చంద్రయ్య తాత, కోటయ్య తాత, నాగేశ్వరరావు పెదనాన్న, సుబ్బరావు పెదనాన్న, శేషయ్య తాత, మా నాన్న.. వీళ్లందరూ దాదాపు రోజూ ఓ వేపకొమ్మ విరిచి నోట్లో పెట్టుకునే వాళ్లు. ఇంకా అటు, ఇటు తిరిగే వాళ్లు కూడా దంతధావనానికి ఆ కొమ్మల్ని విరిచేవాళ్లు. ఆ చుట్టుపక్కల వాళ్లు ఎవరు పొంగలి పెట్టుకోవాలన్నా ఆ కొమ్మలే విరుచుకువెళ్లే వాళ్లు. ఐస్ బండ్ల వాళ్లు, ఇంకా బట్టలు అమ్ముకోవడానికి వచ్చిన వారు ఆ చెట్టు కిందే కాసేపు కూర్చునే వారు. గొర్రెలు, బర్రెలు తోలుకుని పొరుగూళ్ల నుంచి వచ్చిన వాళ్లకి ఆ వేపచెట్టే విడిది కేంద్రం.

            ఇలా ఒకటా.. రెండా. వందలా..వేలా.
సముద్రాల్లోని నీరంతా సిరాగా, చెట్ల ఆకులన్నీ కాగితాలుగా మారినా నీ సుగుణాలను వర్ణించతరమా శ్రీరామా… అన్నాడు వాల్మీకి మహర్షి. అలాగే పదిహేనేళ్ల జ్ఞాపకాల్ని పది పేరాల్లో కుదించాలనుకోవడం అసాధ్యం. కానీ కొండంత దేవుడికి కొండంత పత్రి వేయలేంగా. ఇది కేవలం కొండను అద్దంలో చూపే ప్రయత్నం. ఇది రాసే సమయంలో నా మనోఫలకంపై మెదిలిన కొన్ని సంఘటనలు మాత్రమే ఇవి. చెట్టుపై ఎన్ని ఆటలాడినా.. మరెన్ని వేషాలేసినా.. మీదెక్కి తొక్కినా..తల్లిలా భరించిందిగానీ.. ఎవ్వర్నీ  తోసేయలేదు. గాయపరచ లేదు. చెట్టుపై నుంచి పడి దెబ్బలు తగిలిన వాళ్లు ఇప్పటివరకు ఎవరూలేరు. గాలివీస్తున్నప్పుడు శివాలెత్తినట్టు ఊగిపోయే చెట్టువైపు భయంగా.. వర్షం వెలిశాక ఆకు చివర్లన వేలాడుతూ ఉంటే నీటి బిందువులతో మెరిసిపోయే చెట్టువైపు అబ్బురంగా.. శిశిరంలో ఆకులు రాలి మోడువారినప్పుడు జాలిగా.. వసంతంనాటికి లేత చిగుర్లుతొడిగి పచ్చని పరికిణీ కట్టుకున్నట్టు ఉండే చెట్టువంక ఆనందంగా.. ఇలా ప్రతి సందర్భంలోనూ ఆ చెట్టు మాకు ఓ అద్భుతం. కొన్ని జీవితాల్లోని ఓ సువర్ణ అధ్యాయానికి వేదిక. వేనవేల ఆనందానుభూతులకు మౌన సాక్షి. ఆ మధ్య తుఫాను గాలి వీచింది. చెట్టు మొదలుతో సహా లేచివస్తుందా అనేంతగా గాలి. రావణాసుడురుడు సీతమ్మను తీసుకెళ్తుంటే.. జాటాయువు అడ్డుపడి పోరాడి.. రెక్కలు పోగొట్టుకొని రాలిపోతుంది. అలాగే చెట్టు మిగిలిందిగానీ రెండు పెద్ద కొమ్మలు విరిగిపోయాయి. ఆ రోజు మా రెక్కలు విరిగిపోయినట్టు మేము పడిన బాధ వర్ణనాతీతం. తర్వాత మళ్లీ గంగమ్మకు గుడి కట్టేందుకు అడ్డుగా ఉన్నాయని కొన్ని కొమ్మలను కొట్టేసినప్పుడూ అదే బాధ. కొన్ని వైభవాలకు, పతనాలకు, వేడుకలకు, విషాదాలకు, సామరస్యాలకు, సవాళ్లకు, మంచికి, చెడుకి.. ఆ చెట్టు ఓ మౌనసాక్షి. ప్రతి మనిషీ కొన్నేళ్ల తర్వాత ఓ జ్ఞాపకం అంటాడు ఓ తత్వవేత్త. ఆ చెట్టునాటిన మా నాయనమ్మ ఇప్పుడు లేదు.. దానిపై ఆడిపాడిన మనం కూడా కొన్నేళ్ల తర్వాత ఉండం. కాని ఆ చెట్టు శాశ్వతం. దాంతో పాటే… దానిని అల్లుకున్న జ్ఞపకాలు కూడా…. ఇలా అప్పుడుడప్పుడు ఆ జ్ఞాపకాల పందిరిలో ఊరేగడం నాకు సరదా. మన వయసు పెరుగుతున్నా ఏదో మూల ఆ పసిదనపు ఛాయల్ని సజీవంగా ఉంచిన ఆ భగవంతుడికి మరొక్కసారి దండం చెప్పుకుంటున్నా.

         చెట్టు చెడును పీల్చుకుని మంచి వదుల్తుందని పెద్ధలు చెబుతారు. ఈ లెక్కన మన ఊర్లోని చెడును పీల్చుకోవాలంటే చెట్లు పనికిరావు. తోటలు సరిపోవు. అడవులు కావాలి. చిల్లచెట్ల సహా దేనిని వదలకుండా నరికేసి, ఊరి చుట్టుపక్కల ఎక్కడా పచ్చదనం అనేది లేకుండా చేసేందుకు శాయశక్తులా కషి చేస్తున్న మనూరి మహానుభావులందరికీ మంగిడీలు. 

       ఈ మిడిమేలపు బుద్ధులు వీలైనంత త్వరగా తొలగిపోయి.. ఇంటి పెరళ్లు, చెరువు గట్లు, రోడ్లు..ఇత్యాది సమస్తం పచ్చదనం పరవళ్లుతొక్కుతూ కళకళలాడాలని కోరుకుంటూ… భావితరాలు కోరుకుంటుంది ఎడారుల్ని కాదు.. నందనవనాల్ని అని మనవి చేసుకుంటూ…
                                                        
                                                           అందాకా
                                                 నూరు పూలు వికసించనీ….
                                             వేయి ఆలోచనలు సంఘర్షించనీ..

                                                  ఉగాది శుభాకాంక్షలతో…
                                                   అశోక్ పొడపాటి
Share this article :

+ comments + 5 comments

April 11, 2013 at 11:26 AM

vijayanaama mari vijam undaalani korukuntooo meeee ashok karumudi... hardcorebalayya fan

Anonymous
April 11, 2013 at 1:30 PM

nice

April 12, 2013 at 9:55 AM

మాటలతో చెప్పలేనంత ఆనందం గా ఉంది ఈ ఆర్టికల్ చదువుతుంటే అశోక్ ..... అన్ని కళ్ళ ముందు నిన్న

,మొన్న జరిగినట్లుంది ... 15 ఏళ్ళ క్రితం జరిగిన దాన్ని ఇంత గొప్పగా గుర్తుంచుకుని ..పెరు పేరు నా చదువు

తుంటే చాల అద్బుతం గా ఉంది .ఽస్సల మన ఊర్లో మన చిన్నపుడు అంత స్కూల్ ఆటలే కదా పిల్లలకు అంటే

ఆరోజులలో మనకు నేను కూడా మీ వేప చెట్టు దగ్గర మనం అందరం కలసి క్రికెట్ ఆడే వాళ్ళం కదా అది బాగా

గుర్తుంది నాక్కూడా ... దీనిలో అదికూడా నవ్వు రాసుండాల్సింది చక్కగా ... ఇంకా గొప్ప విషయం ఏంటంటే

ఇప్పటికి మనం అందరం ఊర్లో ఉంటె చేసే మొదటి పని క్రికెట్ ఆడటమే కదా ...దీని గురించి కూడా రాయాలి

నువ్వు ,అస్సల మన ఊర్లొ ప్రజలందరికీ తెల్సిన ఒకే ఒక టీవీ అనేది ఉన్నప్పుడు ,నా చిన్నపుడు ఆదివారం

కోసం దూరదర్సన్ లో వచ్చే సినిమా కోసం ఎదురుచూస్తూ ,బాబోయ్ ఉరు ఊరంతా సింగయ్య తాత వాళ్ళ

ఇంట్లో పంచ దగ్గర నుండి ఎదురుగ ఉన్న గోడ నిండా జనాలతో అదొక సినిమా హాల్ ని తలపించేలా ఉండేవాళ్ళు

,ఇలాగె మా ఇంటి దగ్గర కూడా మా పక్క ఉన్న ఆడోలందరూ పనులు లేని రోజుల్లో చక్కగా చేరి మా అమ్మ ,

మాదవ పిన్ని ,అనుసూరి నాయనమ్మ ,రాము(రమా పిన్ని) చైతన్యోలమ్మ ,ఇలా ఇంకా చాలా మంది తో ఏవేవో

కబుర్లాడుతూ ఉండే వాళ్ళు ,ఓ పక్క మంగాయీ నాని పెద్ద పెద్దగా ఎవరినో ఒకరిని తిడుతూ అల చాలా

,అస్సల చీకటి పడిందంటే చాలు మా ఇంట్లో ఎప్పుడు ఐదు, ఆరుగురు మంది ఒక పక్క మా నాన్న ,

నాగేశ్వరరావు మామ చుట్టలేస్తూ ఉండేవాల్లయ్య ,దేసు ,శీను బాబాయి ,అప్పుడప్పుడు బుల్లి బాబాయి ఇంకా

అప్పుడప్పుడు చిన్న మామ ,టెలిఫోన్ అంజయ్య బాబాయీ ,నైట్ కరెక్ట్ గా వార్తల టయానికి ఎదురుగ ఉన్న

లచ్చుమయ్య వాళ్ళ శేషయ్య తాత వార్తలు చూసి ఈలోగా పొలాల గురించి దున్నకం గురించి ఏవేవో కాబుర్లాడి

గాని తృప్తి గా వెళ్ళే వాళ్ళు ... ఇవన్ని పాత రోజులులే ఇప్పుడు కాదు ... ఇప్పటికి గొప్ప విషయం ఏంటంటే

మంచికో చెడుకో తెలియదు గాని అల మాట్లాడుకునే వాత వరణం మాత్రం మా బజారుకి పులి లా ఉండే

సింగయ్య తాత వాళ ఇంట్లో ఎప్పుడు 4 కలసి ఎవ్వరం వేస్తూనే ఉంటారు మరి. ఇవన్ని నవ్వు రాసిన వేపచెట్టు

చదువుతుంటే నాకు గుర్తొచ్చిన కొన్ని తీపి జ్ఞాపకాలు అశోక్ ... ఒక మంచి జ్ఞాపకం అందినందుకు మన ఊరి

తరుపున ,మన మిత్రులందరి తరుపున నీకు అబినందనలు .

April 12, 2013 at 1:09 PM

వేపచెట్టు కింద క్రికెట్ ఆడుకున్న విషయం ఎందుకో నాకు ఆ సమయానికి గుర్తుకురాలేదు. కచ్చితంగా రాసుకోవాల్సిందే. కాలం చాలా విషయాల్ని మార్చేస్తుంది. దానిలో భాగంగానే మనూరు బారింది. కానీ చాలా అనారోగ్యకర రీతిలో. ఏదిఏమైనా మళ్లీ మార్పు వస్తుందని ఆశిద్దాం. దాని కోసం మన ప్రయత్నం చేద్దాం.
- అశోక్ పొడపాటి

June 26, 2013 at 2:26 PM

its realey sweat memory anna thanks for giving my past

Post a Comment
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved