పల్లెకు పండగొచ్చింది..


 సంక్రాంతి..తెలుగు లోగిళ్లలో జరుపుకునే పెద్ద పండుగ. నిండు మనసుతో చేసుకునే అచ్చమైన పల్లె పండుగ. ‘మన’ అనుకునేవాళ్లంతా ఒకచోట చేరి కష్టాసుఖాల్ని పంచుకుని, ఆత్మీయతల్ని పెంచుకునే పండుగ. అలాంటి అద్భుతమైన పండుగ.. మనూళ్లో కొన్నేళ్ల పాటు దండగగా మారింది. ఆటలు, పాటలు, విందులూ, వినోదాలు, సందళ్లూ, సరదాలూ ఏమీ లేకుండా నిస్సారంగా మారిపోయింది. కారణాలు ఏవైనా గుడి అంటరానిదైంది. వీధికో వర్గం, ముఠాకో దేవుడూ(దేవత) వచ్చాక కనీసం ఊరంతా కలిసి చేసుకునే వేడుక లేకుండా పోయింది. ఆఖరికి కొన్నేళ్లు అందరూ కలిసి సరదాగా జరుపుకున్న వినాయకచవితి కూడా కాలక్రమంలో, మన వాళ్ల అతితెలివితేటల్తో కొందికే పరిమితమైంది. ఆఖరికి ఈ చీడ పిల్లలకు కూడా అంటుకుంది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు.. ‘మీ దేవుడూ..మాదేవుడూ, మీ బజారు.. మా బజారు’ అంటూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ‘ఇది మన ఊరు.. వీళ్లంతా మన వాళ్లు.. మనమందరం బంధువులం, కాకపోతే స్నేహితులం’ అని వాళ్లకి అనిపించడానికి కనీసం ఒక్క అవకాశం కూడా లేకుండా పోయింది. లేకుండా చేశాం అంటే సబబేమో. అందరూ తలో స్కూల్లో చదవడం, కొందరు పూర్తిగా హాస్టళ్లకే పరిమితమవ్వడం కూడా వాళ్ల మధ్య గ్యాప్‌కు కొంతమేర కారణం. 

       ఈ వల్లకాడు లాంటి ఊరికి వసంతం తీసుకురావడానికి, మోడువారిన అనుబంధాలకు కొత్త చివుళ్లు తొడిగించడానికి, పిల్లల మధ్య పరిచయాలు, ప్రేమానురాగాలు పెంచడానికి ఉన్న అన్ని దారులూ మూసుకుపోయి ఒంటరితనపు కారుచీకట్లు కమ్ముకున్న వేళ.. మనకు చిక్కిన వెలుగుదీపం సంక్రాంతి. మన ఊరు.. మన జనం..మన పండుగ.. అనుకున్న కొందరు కుర్రాళ్ల తపనకు నిదర్శనమే రెండేళ్లుగా మనూళ్లో జరుగుతున్న సంక్రాంతి వేడుకలు. మన సంకల్పం మంచిదైనప్పుడు, మన కోరిక నిస్వార్థమైనప్పుడు అంతా సవ్యంగా సాగిపోతుందన్న మా నమ్మకం.. సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటిన వేళ రెట్టింపైంది. 

    వాస్తవానికి గతేడాది సంక్రాంతికి పెద్దగా ప్లానింగ్ ఏమీ లేదు. భోగి వేడుకలు, పిల్లలకు ఆటలపోటీలు, కుర్రాళ్ల క్రికెట్, కొత్తపట్నం టూర్, పెద్దాయన వర్ధంతి అనుకోకుండా అద్భుతంగా జరిగాయి. పోటీలు జరుగుతున్నప్పుడు, బహుమతులు ప్రదానం చేస్తున్నప్పుడు పిల్లలు చాలా ఎక్సైట్ అయ్యారు.  వారితో పాటు పెద్దలు కూడా. మనూళ్లో తొలిసారి అనుకుంటా.. పిల్లలకు బహుమతులు ఇవ్వడం. ఆ సంక్రాంతి అందరికీ గొప్ప అనుభూతుల్ని మిగిల్చింది. వాటిని పూర్తిగా మర్చిపోకముందే మళ్లీ సంక్రాంతి వచ్చింది. ఈ ఏడాది వేడుకల్ని కూడా ఆ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా చేయాలన్న లక్ష్యంతో అందరూ ఊరికి వచ్చారు. 


    13వ తేదీ వేకువ జామున భోగి మంటతో వేడుకలకు అంకురార్పణ జరిగింది. ఇక మధ్యాహ్నం క్రికెట్. సాయంత్రం సరదా కబుర్లు. మరుసటి రోజు ఉదయం గుడి, బడి వద్ద ఫొటోసెషన్. సాయంత్రం పిల్లలకు ఆటల పోటీలు. అప్పటి వరకు ఏదో మూల చిన్న అనుమానం. ఆటలపోటీలు గత ఏడాదిలా సక్సెస్ అవుతాయా అని. మా అనుమానాల్ని పటాపంచలు చేస్తూ పోటీలు అద్భుతంగా జరిగాయి. మేము ఊహించిన దానికన్నా రెట్టింపు పిల్లలు వచ్చారు(ఊళ్లోని పిల్లలందరూ వచ్చారనడం సమంజసం). సిమెంట్ రోడ్డు జనంతో కిక్కిరిసిపోయింది. ఊరుఊరంతా రోడ్డుపై నిల్చున్న క్షణం అది. అంతమంది పిల్లల్ని ఒకచోట చూసి ఊళ్లో వాళ్లే ఆశ్చర్యపోయారు..‘ మనూర్లో ఇంత మంది పిల్లలు ఉన్నారా అని’. వాళ్ల ఆనందం చూసి పోటీల్లో మరిన్ని ఆటలను చేర్చారు. ఇక కాలేజీ పిల్లలు కూడా ఆటలకు సై అన్నారు. మేమూ ఆడతామని మన బీటెక్ బాబులు ముందుకొచ్చారు. అలా ఊరుఊరందరి చేత కేరింతలు కొట్టించిన అద్భుత క్షణం అది. ఇక ఆ రాత్రి మళ్లీ చర్చలు.

    మరుసటి రోజు కనుమ. క్రికెట్‌తో ముగిసింది. ఆ రాత్రి ఒంగోలు వెళ్లి ఫ్రైజులు, పలహారాలు తీసుకొచ్చి అర్ధరాత్రి వరకూ ప్యాక్ చేయడం ఓ మరువలేని అనుభవం. ఇక మరుసటి రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. కొత్తబట్టల్తో రంగురంగుల సీతాకోకచిలకల్లా పిల్లలందరూ బడికి వచ్చారు. కొందరు పెద్దవాళ్ళు  వచ్చి కూర్చున్నారు. పిల్లలు కొద్దిసేపు ఆడిపాడారు. సంక్రాంతి వేడుకలు, మన వెబ్‌సైట్ గురించి వారికి వివరించిన తర్వాత కుర్రాళ్ల చేతులమీదుగా బహుమతుల ప్రదానం. ‘మనకి ఎవడూ ఎప్పుడూ చిన్న స్కేల్ ముక్క కూడా ఇవ్వలేదు.. వీళ్ల పనే బావుంది...’ అంటూ మనోళ్ల సరదాలు. తర్వాత స్వీటు, హాటు పంపిణీ. తర్వాత యథా ప్రకారం క్రికెట్. సాయంత్రం గుడి అరుగు మీద మీటింగ్. 


 వేడుకలు ఎంత బాగా జరుగుతున్నా.. బీచ్‌కు వెళ్లలేదే అని కొంత నిరాశగా ఉన్న తరుణాన.. బంపర్ ఆఫర్.. వంశీ పెళ్లి పార్టీ. అద్భుతః. ఇక సాయంత్రం కొందరు సినిమా హాళ్ల దగ్గర, మరికొందరు అప్పాయగుంటలోని తెప్ప తిరనాళ్ల దగ్గర. రాత్రికి యథాప్రకారం బడి దగ్గర కలుసుకుని మంటతో చలిని తరిమేస్తూ మాటలు. ఇక మరుసటి రోజు ఉదయం నుంచే ఎన్టీఆర్ వర్ధంతి హడావిడి. సాయంత్రానికి ఫెక్సీ డిజైనింగ్ పూర్తయింది. రాత్రికి పిల్లలు, కుర్రాళ్లు కలిసి చెరువుగట్టుపై గుంజలు బాది ఫెక్సీ కట్టారు. ఆ రాత్రి మళ్లీ పలహారాల ప్యాకింగ్. ఇక మరుసటి రోజు బాణసంచా మోతలతో వర్ధంతి మొదలైంది. పూజలు, నినాదాలతో సాగిపోయింది. పిల్లలు, యువకులు, పెద్దల నివాళులతో ముగిసింది. ఇక కాసేపు ముక్తినూతలపాడులో విగ్రహం వద్ద కాలక్షేపం. ఆ రాత్రికి కొందరు, రెండు రోజులు అటుఇటుగా మరికొందరి ప్రయాణంతో వేడుకలు ముగిశాయి.

      ఈ సంక్రాంతి ఇంత అద్భుతంగా జరగడం వెనుక అందరి కృషి ఉంది. చొరవ ఉంది. చిన్నచిన్న త్యాగాలూ ఉన్నాయి. అందుకనే ఎవరి పేరూ ప్రస్తావించ లేదు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో(శాలరీలు వదిలేసి, సెలవులు ఇవ్వకుండా హెచ్‌ఓడీలు వార్నింగ్ ఇచ్చినా పట్టించుకోకుండా) వచ్చిన వారి గురించి కొంత చెప్పుకోవాలి. మన చక్రపాణి, చిరంజీవి, శివలు సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో ఊరిలో ఉండాలనే సంకల్పంతో హైదరాబాద్ నుంచి పల్లె వెలుగు బస్సులో వచ్చారు. ఒళ్లంతా హూనమైనా సడలని ఉత్సాహంతో చెలరేగారు. ఇక నరేంద్ర... ఈ సంక్రాంతి వేడుకలకు శాశ్వతత్వాన్ని తెచ్చిన ఫొటోగ్రాఫర్. మధు కారుమూడి, అశోక్(ఒంగోలు), పీఎస్, క్రిష్ , సురేంద్ర, కొండప్ప, అశోక్(కారుమూడి), చైతన్య, గంగాధర్, రామకృష్ణ, సందీప్(పండు), ఫణి, విష్ణు, ఇంకా పిల్లలు... సాయి, గణేష్, కార్తిక్, ప్రవీణ్, శ్రీకాంత్, ఉత్తేజ్, లీనత్, బన్ను....


    పండగ పంచాంగాన్ని చూసి కాదు.. పదిమంది ఒక చోట చేరి ముచ్చట్లాడుకుంతున్నప్పుడు, పకపక నవ్వుకుంటునప్పుడు వస్తుందన్న కవి మాటలు ఎంత సత్యమో ఈ వేడుకలు చాటిచెప్పాయి. పండగ పూర్తయింది. పిల్లలు హాస్టళ్లకు, కుర్రాళ్లు నగరాలకు, పెద్దలు పనులకు.. ఊరు మళ్లీ ఖాళీ అయింది. వారం పాటు కేరింతలు కొట్టిన ఊరని మళ్లీ నిశ్శబ్దం కమ్మేసింది. ఇక ఎవరి బతుకులు వాళ్లవి.. ఎవరి పరుగులు వాళ్లవి.. ఎవరి జీతాలు వాళ్లవి.. ఎవరి జీవితాలు వాళ్లవి. పండగ తాత్కాలికం. కానీ ఆ సంబరాలు పంచిన అనుభూతులు, మిగిల్చిన జ్ఞాపకాలు మాత్రం గుండె గదుల్లో, మెదడు పొరల్లో ఎప్పటికీ పదిలం. అవే మాకు ధనం. మమ్మల్ని నడిపే ఇంధనం. పండగ వేళ 'మనం' అనే మొక్క నాటి వెళ్తున్నాం. అది ఈ క్షణం ఫలించకపోయినా. కొన్నేళ్ల తర్వాతైనా ఫలాల్ని పంచి తీరుతుంని నమ్ముతూ ..... 


                          అసలివన్నీ అవసరమా అని ప్రశ్నించే మనూరి జ్ఞానులకి                                 
                                   మరొక్కసారి నమస్కారాలు చెప్పుకుంటూ..
                                     మరో సంక్రాంతి కోసం ఎదురు చూస్తూ..

                                              ---అశోక్ పొడపాటి---
Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved