మన జిల్లా‎

ప్రకాశం జిల్లా‎

ప్రకాశం జిల్లా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము యొక్క తొమ్మిది కోస్తా ప్రాంతపు జిల్లాల్లో ఒకటి. ప్రకాశం జిల్లా ముఖ్య పట్టణము ఒంగోలు. ఒంగోలు జిల్లా ఫిబ్రవరి 2,1970వ తేదీన, నెల్లూరు, కర్నూలు మరియు గుంటూరు జిల్లాల యొక్క కొంత భాగముల నుండి ఆవిర్భవించినది. తరువాత డిసెంబర్ 5,1972వ తేదీన, జిల్లాలోని కనుపర్తి గ్రామములో పుట్టిన గొప్ప దేశభక్తుడు మరియు ఆంధ్ర నాయకుడైన, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జ్ఞాపకార్ధము ప్రకాశం జిల్లాగా నామకరణము చేయబడినది. ప్రకాశంజిల్లా అనగానే గుర్తుకు వచ్చేవి ఒంగోలు జాతి గిత్తలు.

చరిత్ర

టంగుటూరి ప్రకాశం పంతులు

జిల్లా చరిత్రకు నెల్లూరు, కర్నూలు, గుంటూరు జిల్లాల చరిత్రే ఆధారం. ఈ ప్రాంతాన్ని ఇక్ష్వాక, పల్లవ, చాళుక్య,కాకతీయ రాజ వంశాలు, రెడ్డిరాజులు, విజయనగర రాజులు, గోల్కొండ, కర్ణాటక నవాబులు పరిపాలించారు. భారతాన్ని తెనిగించిన కవిత్రయములో ఒకరైన ఎర్రాప్రగ్గడ, సంగీతంలో పేరుగాంచిన శ్యామశాస్త్రి, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య, ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ ప్రాంతానికి చెందినవారే.

స్వాతంత్రోద్యమ సమయంలో చీరాల పేరాల ఉద్యమం నడిపిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, కొండా వెంకటప్పయ్య, నరసింహరావు ప్రసిద్దులు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రావతరణ తర్వాత మొదటిగా ఒంగోలు జిల్లా ఏర్పడింది. ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లా యొక్క మూడు తాలూకాలు (అద్దంకి, చీరాల మరియు ఒంగోలు), నెల్లూరు జిల్లా యొక్క నాలుగు తాలూకాలు (కందుకూరు, కనిగిరి, పొదిలి మరియు దర్శి) మరియు కర్నూలు జిల్లా యొక్క రెండు తాలూకాలతో (మార్కాపురం మరియు గిద్దలూరు) ఏర్పడినది. 
1972 లో టంగుటూరి ప్రకాశం పంతులు గుర్తుగా ప్రకాశం జిల్లాగా పేరు మార్చబడింది.

ఒంగోలు, చీరాల, మార్కాపురం, వేటపాలెం, సింగరాయకొండ, కనిగిరి, కంభం, కందుకూరు,అద్దంకి, గిద్దలూరు ప్రధాన పట్టణాలు. వరి, సజ్జలు, రాగులు, జొన్నలు, చెరకు, వేరుసెనగ, ప్రత్తి, పొగాకు ప్రధానపంటలు. మార్కాపురం పలకలకు, చీమకుర్తి గ్రానైట్ గనులకు ప్రసిద్ధి. దీనిలో గుండ్ల బ్రహ్మేశ్వర అభయారణ్యం వుంది.
భౌగోళిక స్వరూపం

ప్రకాశం జిల్లా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రపు దక్షిణ కోస్తాలో సుమారు 150.90 మరియు 160 డిగ్రీల ఉతర అక్షాంశాలు 79 మరియు 80 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య నెలకొని ఉన్నది. ఉత్తరాన మహబూబ్ నగర్ మరియు గుంటూరు జిల్లాలు, పశ్చిమాన కర్నూలు జిల్లా, దక్షిణాన కడప జిల్లా, నెల్లూరు జిల్లాలు, తూర్పున బంగాళా ఖాతము సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లాలోని మధ్య ప్రాంతం చిన్న చిన్న పొదలతో, కొండలతో, రాతి నేలలతో కూడి జిల్లాకు ఒక ప్రత్యేకతను ఆపాదిస్తున్నాయి.
Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved