అట్ల తద్దె


ఇస్తినమ్మ వాయినం … తీసుకుంటి వాయినం


 
అట్లతద్దోయ్‌ ఆరట్లోయ్‌, ముద్దపప్పు మూడట్లోయ్‌ అంటారు ఆరుద్ర ఏదో తెలుగు సినిమాలో. రాష్ట్రంలో ఏఏ ప్రాంతాల్లో ఈ పండుగను జరుపుకుంటారో తెలియదుగానీ కోస్తా గ్రామాల్లో మాత్రం పదేళ్ల క్రితందాకా ప్రశస్తంగా జరిగేది. మారిన పరిస్ధితుల్లో ఈ పండుగ నామమాత్రమయింది. అందులోనూ సాంఘీక కోణం పూర్తిగా మరుగున పడిపోతోంది. ఆథ్యాత్మిక కోణంతో పండుగను ముగిస్తున్నారు.
ఆథ్యాత్మిక కోణాన్ని ఆవలబెట్టి చూస్తే అట్లు, ఊయళ్లు ఈ పండుగ ప్రత్యేకతలు.
అయితే అట్లతద్దె మాత్రం కనీసం వారం రోజులపాటు సందడి సందడి చేసేది.
ఆడపిల్ల వివాహానికి తోడ్పడిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పేందుకే ఈ పండుగ ప్రారంభమయి ఉండొచ్చు. వివాహాననంతరం వచ్చే తొలి ఆశ్వయుజ బహుళ తదియనాడు అట్లతద్దె పండుగను జరుపుకుంటారు. కనీసం ఐదుగురు ముత్తైదవలను, ఓ పోతురాజునూ ఎంపికచేసుకుని వారి ఆధ్వర్యంలో పూజలు – పునస్కారాలు, వ్రత, భోజన, వాయనాల కార్యక్రమాలను నిర్వర్తిస్తారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దాపన అని పిలుస్తారు  ప్రాంతంలో ముత్తైదవలతోపాటు బంధువులకు కూడా 11 అట్లచొప్పున అందజేస్తారు. చూసేందుకు ఈ వ్యవహారం భలే విచిత్రంగా ఉంటుందిలే. 11 అట్లను ఉంచిన మూకుడుని వెనక్కు పెట్టుకుని ”ఇస్తినమ్మ వాయినం” అని ఇచ్చేవాళ్లు అంటుంటే, ”తీసుకుంటి వాయినం” అంటూ తీసుకునేవాళ్లు కూడా వెనక నుంచి తీసుకుంటారు.  ఉద్దాపన తీర్చదలచుకుంటే ఆ ఇంట్లో వారం రోజుల ముందు నుంచే సందడే సందడి. సమీప బంధువులంతా చేరుకుంటారు. చుట్టుపక్కల అమ్మలక్కలందరికీ ఆ ఇల్లే కేంద్రం. అందరూ చేరి పిండి వంటలకు ఏర్పాట్లు చేస్తుంటారు. పండుగ ముందు రోజే నాలుగయిదు పొయ్యిలు పెట్టి తట్టలకొలదీ అట్లు పోస్తారు.
ఇక ఊరి నిండా ఇంటింటా, చెట్టుచెట్టుకూ ఉయ్యాళ్లు కన్పించటం పండుగ ప్రత్యేకత. అవికాక కనీసం వీధికి ఒక్కటయినా పెద్ద ఊయల వేస్తారు. ఇక బజార్లలో వేసే ఊయలను బలంగా ఊపితే ఆకాశానికి చేరుతుందంటే నమ్మాల్సిందే.  అటూ ఇటూ కనీసం 15 అడుగుల నుంచి 20 అడుగుల మేర ఎత్తుకు పోయి తిరిగొస్తుంటుంది. అన్ని వయస్సుల ఆడవాళ్లూ, యువకులు, పిల్లలంతా ఊయళ్లు ఎక్కి ఊగుతుంటారు. వీటిని కనీసం వారం, పది రోజులపాటు ఉంచుతారు. అందరికన్నా ఈ పండుగ పిల్లల్లో ఆనందం అంబరాన్నంటుతుంది. కొత్త దుస్తులు, పిండి వంటలు లేకపోయినా ఓ తాడును ఇంటి దూలానికి కట్టి ఊగటంతో ఆ ఆనందం పిల్లలందిరి సొంతమవుతుంది. పండుగ మాటెలాగున్నా ఓ చెట్టుకో, ఇంటి వసారా కొక్కేనికో ఓ తాడును కట్టి మీ బుడుగుల్నీ, సీగాన పెసూనాంబలనూ అందులో కూర్చోబెట్టి ఊపండి. అన్నట్లు  ఊయల తాడు రెండు మడతలు  ఉండాలి. పిల్లలు కూర్చునేందుకు గుడ్డతో తొట్టిని ఏర్పాటు చేయాలంటే రెండు మడతల తాడు అవసరం మరి. ఆ ఊయలలో మీ పిల్లలు ఊగుతుండగా వారి ముఖాల్ని చూడండి. ఎన్నడూ లేనంతగా వెలిగిపోతుంటాయి. అన్నట్లు పిల్లల పాటల్ని, వీలయితే ఊయల పాటల్ని విన్పిస్తూ వాళ్లను ఊపండి. అది వారికి స్వర్గారోహణమేనంటే నమ్మండి మరి.
Share this article :

+ comments + 1 comments

November 1, 2012 at 1:15 PM

మనూర్లో ఇంతకు ముందు బాగా చేసేవారు. ఇప్పుడు లేదు. జనానికి బాగా డబ్బు చేసింది.

Post a Comment
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved